
న్యూఢిల్లీ: గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడో వారమూ ఈ మిలిటరీ ఆక్రమణ కొనసాగుతూనే ఉన్నది. రష్యా వెంటనే దాడులను నిలిపేయాలని అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రంగా ఒత్తిడి వస్తున్నా.. వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే 203 నోబెల్ అవార్డులు పొందిన ప్రముఖులు తమ గళం ఎత్తారు. రష్యా ప్రభుత్వం తీరును ఖండించారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆక్రమణను నిలిపేయాలని కోరారు. స్వేచ్ఛాయుత, స్వతంత్ర ఉక్రెయిన్‌కే తమ మద్దతు అని స్పష్టం చేశారు.
నోబెల్ గ్రహీతలు రాసిన లేఖ ఇలా ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి గతంలోని కొన్ని దురాగతాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. 1939లో నాజీ జర్మనీ.. ఇలాంటి ట్రిక్కులతోనే పోలాండ్‌పై దాడి చేసిందని, అలాగే, 1941లో సోవియట్ యూనియన్‌పైనా దాడులు చేపట్టిందని, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆ దుర్ఘటనలను జ్ఞప్తికి తెస్తున్నాయని వివరించారు. ఇది మిలిటరీ ఆక్రమణ కాదు.. యుద్ధానికి ఏ మాత్రం తక్కువ కాకుండా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాము తమ పదాలను చాలా జాగ్రత్తగా పేర్కొంటున్నామని, ఎందుకంటే.. రష్య ప్రజలకు ఈ దాడిలో భాగస్వామ్యం లేదనే భావిస్తున్నట్టు వివరించారు.
చట్టబద్ధంగా ఉన్న ఉక్రెయిన్ ఉనికినే ప్రశ్నిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన చర్యలను ఖండించేవారిలో తామూ చేరుతున్నామని ఆ నోబెల్ గ్రహీతలు తెలిపారు. ఎందుకంటే.. ప్రతి ఘర్షణకు శాంతియుత పరిష్కారం తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఐరాస చార్టర్‌ను రష్యా దాడి దారుణంగా ఉల్లంఘించిందని తెలిపారు. యూఎన్ చార్టర్ ప్రకారం, అన్ని సభ్య దేశాలు మరో స్వతంత్ర దేశ సమగ్రతను, రాజకీయ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయకూడదు అని వివరించారు. అంతేకాదు, 1994లో చేసుకున్న బుడాపెస్ట్ మెమోరాండాన్ని కూడా విస్మరించిందని పేర్కొన్నారు.
రష్యా భద్రతపై ఆందోళనలనూ కొట్టిపారేయలేమని, కానీ, వాటికి యూఎన్ చార్టర్ ఫ్రేమ్‌వర్క్‌లోనే పరిష్కారం లభిస్తుందని వివరించారు. దానితోపాటు 1975 హెల్సింకి ఫైనల్ యాక్ట్, 1990 ప్యారిస్ చార్టర్‌లూ రష్యా భద్రతకు భరోసా ఇస్తాయని తెలిపారు. కాబట్టి, యుద్ధానికే మొగ్గు చూపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన మద్దతుదారులు తప్పుదారి ఎంచుకున్నారని, అది ఎంతమాత్రం ప్రయోజనం ఇవ్వని, భవిష్యత్‌ను రక్తసిక్తం చేసే దారి అని ఖండించారు. రష్యా ప్రభుత్వం చర్యలతో ఆ దేశానికి ఉన్న అంతర్జాతీయ రిప్యూటేషన్‌ను దెబ్బతీస్తుందని, ఆ దేశ పౌరులకూ అంతర్జాతీయంగా కష్టాలను తెచ్చి పెట్టవచ్చని పేర్కొన్నారు. రష్యా ఎందుకు ఈ యుద్దానికి తెగబడి ఇతర దేశాలతో కంచె పెంచుకుంటున్నదని ప్రశ్నించారు. వెంటనే ఉక్రెయిన్‌లోని రష్యా సైన్యాన్ని వెనక్కి తెచ్చుకోవాలని, యుద్ధాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘర్షణల్లో మరణించిన ఉక్రెయిన్, రష్యా పౌరులకు తమ ప్రగాఢ సంతాపం అని తెలిపారు.