జోర్డాన్ పోర్ట్ సిటీ అకాబాలో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్.. 13 మంది మృతి

By Sumanth KanukulaFirst Published Jun 28, 2022, 10:00 AM IST
Highlights

జోర్డాన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమై అకాబాలో ప్రమాదవశాత్తు క్లోరిన్ గ్యాస్ లీక్ అవ్వడంతో 13 మంది మరణించారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి మీడియా వివరాలను వెల్లడించింది.

జోర్డాన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమై అకాబాలో ప్రమాదవశాత్తు క్లోరిన్ గ్యాస్ లీక్ అవ్వడంతో 13 మంది మరణించారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి మీడియా వివరాలను వెల్లడించింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ల‌ను క్రేన్‌తో ఓడలో లోడ్ చేస్తున్న సమయంలో.. అందులో ఒక ట్యాంకు పక్కకు పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. 

ఈ ప్రమాదానికి సంబంధించి స్టేట్ టెలివిజన్ పోస్టు చేసిన వీడియోలో.. స్టోరేజ్ ట్యాంక ఒకటి క్రేన్ వించ్ నుంచి పడిపోవడం కనిపించింది. అది ఎత్తు నుంచి ఒడపై పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పసుపు రంగు వాయువు గాలిలోకి వెలువడింది. దీంతో ఆ సమీప ప్రాంతంలోని వారు పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గాయపడిన వారిని అక్కడి నుంచి తరలించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని మూసివేసినట్టుగా పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నిపుణులను పంపినట్టుగా వెల్లడించారు. 

ఈ ఘటనలో గాయపిడిన 199 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అల్-మమ్లాకా టీవీ తెలిపింది. మొత్తం 251 మంది గాయపడ్డారని పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది. ఇక, ప్రజలు లోపలే ఉండి కిటికీలు, తలుపులు మూసివేసి ఉంచుకోవాలని స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ జమాల్ ఒబీదత్ కోరారు. అయితే ప్రమాదం జరిగిన అకాబా నౌకాశ్రయానికి సమీప నివాస ప్రాంతం 25 కిలో మీటర్ల దూరంలో ఉంది. 

click me!