
ఉగాండాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉగాండాలోని అంధుల పాఠశాలలో మంటలు చెలరేగడంతో పదకొండు మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు స్థానిక పోలీసులు మంగళవారం వివరాలు వెల్లడించారు. వివరాలు.. ఉగాండా రాజధాని కంపాలాకు తూర్పున 30 కి.మీ దూరంలో ఉన్న ముకోనోలోని సలామా అంధుల పాఠశాలలో అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉగాండాలో పాఠశాలల్లో, వసతి గృహాల్లో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం విద్యాశాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2020లో కంపాలాలోని ప్రముఖ బోర్డింగ్ స్కూల్‌లోని రెండు వసతి గృహాలు వేర్వేరు సంఘటనల్లో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదు. ఇక, 2008లో కంపాలా సమీపంలోని గ్రేడ్ స్కాలర్స్‌కు చెందిన ఒక బోర్డింగ్ స్కూల్‌లో రాత్రి సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది విద్యార్థులు మరణించారు.