పాకిస్థాన్ లో మృత్యు ఘోష.. విహార యాత్రలో విషాదం.. 10 మంది విద్యార్థులు మృతి, పలువురికి తీవ్రగాయాలు 

By Rajesh KarampooriFirst Published Jan 29, 2023, 10:49 PM IST
Highlights

వాయువ్య పాకిస్థాన్‌లో పడవ బోల్తా పడింది, 10 మంది విద్యార్థులు మృతి, 15 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బోటులో 30 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని డిప్యూటీ కమిషనర్ కోహత్ ఫుర్కాన్ అష్రఫ్ తెలిపారు. 16 మంది చిన్నారులను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వాయువ్య పాకిస్థాన్‌లోని ఓ సరస్సులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో మదర్సాలోని 10 మంది విద్యార్థులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. మదరసా మిర్బాష్ ఖేల్‌కు చెందిన ఏడు నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలోని తాండా డ్యామ్ సరస్సు వద్ద విహార యాత్రకు వెళ్లారని అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది 10 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో బోటులో 30 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని డిప్యూటీ కమిషనర్ కోహత్ ఫుర్కాన్ అష్రఫ్ తెలిపారు. 16 మంది చిన్నారులను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. 

ఓవర్‌లోడే ప్రమాదానికి కారణమా? 

ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఓవర్‌లోడింగ్ కారణంగా పడవ బోల్తా పడిందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా పోలీసు అధికారి అబ్దుల్ రవూఫ్ కైసరాణి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారులతో కలిసి మృతదేహాలను నీటిలో నుంచి బయటకు తీశారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రెస్క్యూ టీమ్ కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి అజం ఖాన్ బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయం అందించాలని స్థానిక పరిపాలనను ఆదేశించారు. 

బస్సు ప్రమాదం..  42 మంది మరణం..

మరోవైపు.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రయాణికుల బస్సు వంతెన పిల్లర్‌ను ఢీకొని కాలువలో పడిపోవడంతో మహిళలు, చిన్నారులు సహా 42 మంది చనిపోయారు. కనీసం 48 మంది ప్రయాణికులతో బస్సు ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టా నుండి సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీకి వెళుతోందని పోలీసు అధికారి తెలిపారు. ఈ బస్సు బ్రిడ్జిపై ఉన్న స్తంభాన్ని ఢీకొని కాలువలో పడి మంటలు చెలరేగాయని తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. లాస్బెలా సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా బస్సు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తుంది.  

click me!