Mokshagundam Visvesvaraya: భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప ఇంజినీర్.. పండితుడు..రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు.
Azadi Ka Amrit Mahotsav : 1908లో భారీ వరదలను ఎదుర్కొని లక్షల మంది నిరాశ్రయులైన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన అద్భుత మేధోశక్తితో ఈ విపత్తుకు పరిష్కారాన్ని కనుగొన్నారు. నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ఆయన ఆలోచనలే. విశ్వేశ్వరయ్య సూచనలతోనే హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరద ముప్పును నివారించగలిగింది. చరిత్రలో ఘనత వహించిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు చినుకు పడిందంటే చిత్తడైపోతుంది. నదులు రోడ్లపై పారుతున్నాయా? లేక దారులే అందులోకి కొట్టుకుపోయాయా? అనేంతలా పరిస్థితులున్నాయి.
హైదరాబాద్‌కు వరద ముప్పు కొత్త సమస్యేమీ కాదు. నిజాంల పాలనలో వచ్చిన వరదలే ఇప్పటికీ తీవ్రమైనవిగా ఉన్నాయి. కానీ, అప్పటి నిజాములు వరదలను చూసి మిన్నకుండిపోలేదు. వరదలకు చెక్ పెట్టడానికి మనమంతా లెజెండరీ ఇంజనీర్‌గా కొలిచే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఎంచుకున్నారు.ఆయన శతాబ్దం కిందే అంటే 1920లలోనే హైదరాబాద్‌కు వరద ముప్పును నివారించారని మీకు తెలుసా? ఆయన జయంతినే భారత్ ఇంజినీరింగ్ డేగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌కు వరద ముప్పు నివారించడానికి ఏం చేశారో ఓ సారి చూద్దాం.
పారిశ్రామికంగా పురోభివృద్ధి సాధించిన దేశాల్లో టెక్నాలజీని పరిశీలించడానికి విశ్వేశ్వరయ్య వరల్డ్ టూర్ వేస్తున్నప్పుడు అంటే 1908, సెప్టెంబర్‌లో భీకర వర్షాలకు హైదరాబాద్ నగరాన్ని మూసీ నది ముంచెత్తింది. సుమారు 19వేల ఇళ్లు నేలమట్టమవ్వగా 15వేల మంది మరణించారు. అప్పుడు నగరంలోని నాలుగో వంతు అంటే దాదాపు ఒక లక్ష మంది నిరాశ్రయులయ్యారు.
ఇప్పటి వరకు 1908లో వచ్చినన్ని వరదలు మరెప్పుడూ రాలేదు. అప్పుడు ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఇందుకు పరిష్కారం కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు. విదేశీ పర్యటన నుంచి వెనుదిరిగి వచ్చిన విశ్వేశ్వరయ్య ఇందుకు అంగీకరించి అధ్యయనం ప్రారంభించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాపాతం, హైదరాబాద్ చుట్టూ ఉన్న నదులు, రిజర్వాయర్లు, ఇతర వివరాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత తన ఇంజినీరింగ్ సొల్యూషన్‌కు ఉపక్రమించారు. తన అధ్యయనం ఆయన నిజాం పాలకుడికి కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.
నగర ఎగువభాగాన రిజర్వాయర్లు నిర్మించాలని, అవి నదుల్లో అపరిమిత ప్రవాహాన్ని నియంత్రిస్తాయనే పరిష్కారానికి వచ్చారు. పౌరుల వసతులకు సంబంధించిన కొన్ని సూచనలూ చేశారు. తర్వాతి ఆరేళ్లకు యేటా రూ. 20 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని చెప్పారు. 1909 అక్టోబర్ 1న ఆయన తన రిపోర్టును సమర్పించారు. అందులోని కొన్ని కీలక ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి..
వరదలు ఎక్కువగా వచ్చే చోట ఆనకట్టల వంటి నిర్మాణాలు చేయాలని, అవి వరద ప్రవాహానికి ఐదు అడుగులకు మించి ఎత్తుండాలని విశ్వేశ్వరయ్య చెప్పారు. వీటిని ప్రధాన దారుల గుండా నిర్మించాలని, తద్వారా పేదలు, ధనికులు ఫుట్‌పాత్‌గా వినియోగించగలుగుతారని వివరించారు. నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చి దిద్దే ఈ అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోకూడదని నొక్కిచెప్పారు. విశ్వేశ్వరయ్య సూచనలను నిజాం పాలకులు అంగీకరించారు. ఆయన సూచనలకు అనుగుణంగానే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. ఆధునిక పద్ధతిలో డ్రెయినేజీని నిర్మించారు. వరదలతో ధ్వంసమైన గోడలను పునర్నిర్మించారు. చార్మినార్మ, మూసి నది మధ్యభాగాన్ని మళ్లీ ఆధునికంగా పటిష్టంగా కట్టారు. జనసమ్మర్థం అధికంగా ఉండే ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పరిసరాల్లో.. నది చుట్టూ సుందీరకరణ పనులు చేశారు.
1911లో మహబూబ్ అలీ పాషా మరణించాక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తదుపరి పనులను పూర్తి చేశారు. 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్‌ల నిర్మాణం పూర్తయింది. దీంతో హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరదల నుంచి సురక్షితంగా ఉన్నది. తదుపరి పాలకులు హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించినప్పటికీ విశ్వేశ్వరయ్య సూచనలను అమలు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా 2020లో మరోసారి హైదరాబాద్ నగరం భారీ వరదలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికీ వర్ష కాలం వచ్చిందంటే నగరవాసులు వణికిపోతుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజునైనా మరోసారి ఆయన అధ్యయనం, ప్రణాళికలను మరోసారి తిరగేసి అమలు చేయడం అవసరమనేది అత్యధికుల అభిప్రాయం.