భారత్-పాక్ మ్యాచ్... అడ్డంగా బుక్కైన గంభీర్

By telugu teamFirst Published Jun 18, 2019, 12:05 PM IST
Highlights

టీం ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశం కన్నా డబ్బే ముఖ్యమా అంటూ... గంభీర్ పై మండిపడుతున్నారు. 

టీం ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశం కన్నా డబ్బే ముఖ్యమా అంటూ... గంభీర్ పై మండిపడుతున్నారు. ఆదివారం జరిగిన భారత్- పాక్ మ్యాచ్ నేపథ్యంలో... గంభీర్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంత పెద్ద నేరం గంభీర్ ఏం చేశాడనేగా మీ సందేహం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల పుల్వామా ఉగ్రదాడి జరిగి 40మందికిపైగా భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ఘటనపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్నారు. మహా అయితే భారత్‌ రెండు పాయింట్లు కోల్పోతుందని, ఆట కన్నా దేశ ప్రజల సెంటిమెంట్‌ ముఖ్యమని పేర్కొన్నాడు.

అలాంటి కామెంట్స్ చేసిన గంభీర్.. మొన్న జరిగిన భారత్- పాక్ మ్యాచ్ లో కామెంటేటర్ గా వ్యవహరించాడు. ‘అసలు పాకిస్తాన్‌తో మ్యాచే వద్దన్న నువ్వు.. ఇప్పుడు డబ్బు కోసం భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు విశ్లేషకుడిగా వ్యవహరిస్తావా.. నీ కపటత్వం జనాలకు తెలిసిపోయింది’ అంటూ ట్రోల్‌ చేయడమే కాక గంభీర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేయడం ప్రారంభించారు. దేశం కన్నా డబ్బు ఎక్కువయ్యిందా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై ఈ సీనియర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Last Updated Jun 18, 2019, 12:05 PM IST