చెత్త టీమ్ వద్దు, రద్దు చేయండి: కోర్టులో పిటిషన్ వేసిన పాక్ అభిమాని

By Siva KodatiFirst Published Jun 19, 2019, 12:01 PM IST
Highlights

ఓ అభిమాని ఏకంగా ప్రస్తుత పాక్ జట్టును నిషేధించాలని న్యాయస్థానంలో పిటిషన్ ‌వేశారు. అలాగే ఇంజుమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

ప్రపంచకప్‌లో భాగంగా భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోవటాన్ని ఆ దేశ అభిమానులు  ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌‌‌తో పాటు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

రక్తం మరిగిపోయే మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ‌‘‘స్లీప్’’ ఫీల్డర్ అంటూ ఆయన అవలింతలపై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాక్ మాజీ క్రికెటర్లు సైతం తమ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడుతున్నారు.

తాజాగా ఓ అభిమాని ఏకంగా ప్రస్తుత పాక్ జట్టును నిషేధించాలని న్యాయస్థానంలో పిటిషన్ ‌వేశారు. అలాగే ఇంజుమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఈ పిటిషన్‌పై స్పందించిన గుజరన్‌వాలా సివిల్ కోర్టు న్యాయమూర్తి పూర్తి వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దాయాది చేతిలో ఘోరపరాభవం నేపథ్యంలో పీసీబీ గవర్నింగ్ బోర్డు సమావేశం కానున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఈ భేటీలో జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. అలాగే పాక్ కోచ్ మిక్కి ఆర్ధర్ కాంట్రాక్ట్‌ను సైతం పొడిగించకుండా ఇంటికి పంపించే యోచనలో పీసీబీ ఉన్నట్లు సమాచారం.

అలాగే టీమ్ మేనేజర్ తలాత్ అలీ, బౌలింగ్‌ కోచ్ అజార్ మొహమ్మద్‌లపై వేటు వేయడంతో పాటు సెలక్షన్ కమిటీని మొత్తం రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!