టీం ఇండియాతో మ్యాచ్ కి ముందు సఫారీలకు ఊహించని షాక్

By telugu teamFirst Published Jun 3, 2019, 4:10 PM IST
Highlights

ఐసీపీ వరల్డ్ కప్ 2019లో సౌతాఫ్రికా అయోమయంలో పడిపోయింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడినా సౌతాఫ్రికాకి విజయం దక్కలేదు. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సఫారీలు ఓటమిని చవిచూశారు. 

ఐసీపీ వరల్డ్ కప్ 2019లో సౌతాఫ్రికా అయోమయంలో పడిపోయింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడినా సౌతాఫ్రికాకి విజయం దక్కలేదు. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సఫారీలు ఓటమిని చవిచూశారు. దీంతో ఇండియాతో జరిగే మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్ కూడా చేయి జారితే... సఫారీ జట్టు సెమిస్ చేరడం కూడా కష్టం.

ఈ సంగతి పక్కన పెడితే... టీం ఇండియాతో మ్యాచ్ కి ముందు సఫారీ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో ఏడో ఓవర్ బౌలింగ్ చేస్తుండగా.. అతని తొడ భాగంలో(హామ్‌స్ట్రింగ్) గాయమైంది. దీంతో ఇండియాతో జరిగే మ్యాచ్‌కి అతను దూరమయ్యే అవకాశం ఉందని జట్టు మేనేజర్ మహ్మద్ మూసాజీ తెలిపారు.

‘‘అతనికి కుడి తొడ భాగంలో తీవ్రంగా గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. అతని నొప్పిని పక్కన పెట్టి తర్వాతి మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేసేందుకు మేం ఇప్పుకోము. ప్రస్తుతానికి అతనికి వారం లేదా 10 రోజులు విశ్రాంతి కావాలి. రేపు స్కానింగ్ నిర్వహిస్తాము. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌ వరకూ అతను ఫిట్‌గా ఉండాలని ఆశిస్తున్నాము’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా లుంగి ఎంగిడి లేకపోవడం జట్టుకి నష్టం కలిగించే విషయమేనని ఆ జట్టు అభిమానులు కంగారు పడుతున్నారు. ఎంగిడి స్థానంలో జట్టులోకి డెయిల్ స్టెయిన్ ని తీసుకునే అవకాశం ఉంది. 

click me!