భార్యకు విడాకులివ్వు: హోం గార్డు మర్మాంగాలపై తన్నులు

By telugu teamFirst Published Feb 11, 2020, 8:25 AM IST
Highlights

హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో ఓ హోమ్ గార్డును ముగ్గురు వ్యక్తులు చితకబాదారు. భార్యకు విడాకులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీనిపై హోంగార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్: ఓ హోమ్ గార్డును దుండగులు చితకబాదిన సంఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారనాడు చోటు చేసుకుంది. భార్యకు విడాకులు ఇవ్వాలంటూ వారు హోం గార్డును చితకబాదారు. 

 భార్యను సరిగా చూసుకోలేని స్థితిలో ఉన్నందువల్ల ఆమెకు విడాకులు ఇవ్వాలని వారు ఆ దారుణానికి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట ఎస్సై ఇందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. జీఎం కాలనీకి చెందన మహ్మద్ అబ్దుల్ ఇమ్రాన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

సోమవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో తాళ్లకుంట సుహానా పంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న తన టూవీలర్ ను వాష్ చేయిస్తున్నాడు. ఆ సమయంలో హబీబ్ ఇమ్రాన్ అనే వ్యక్తి వచ్చి అకస్మాత్తుగా హోంగార్డును కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఆగకుండా మర్మాంగాలపై తన్నాడు.  తీవ్రంగా గాయపడిన హోంగార్డు డయల్ 100కి ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ఫోన్ ను లాక్కుని ధ్వంసం చేశారు. 

మరో ఇద్దరు కూడా కలిసి అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. నీ భార్యకు విడాకులివ్వు... లేదంటే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారు బాధితుడి దూరపు బంధువులని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దాడికి దిగిన ప్రధాన నిందితుడు హబీబ్ ఇమ్రాన్ గతంలో కూడా తనను తీవ్రంగా బెదిరించినట్లు అబ్దుల్ ఇమ్రాన్ తన ఫిర్యాదులో తెలిపాడు.

click me!