హైదరాబాద్ హబ్సిగుడాలో యువతికి పాజిటివ్: పాతబస్తీలో మరో కేసు

By telugu team  |  First Published Apr 14, 2020, 1:27 PM IST
హైదరాబాదులోని హబ్సిగుడాలో ఓ యువతికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ యువతి యూకె నుంచి హైదరాబాదు వచ్చింది. ఆమె తల్లిదండ్రులకు మాత్రం నెగెటివ్ వచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఉప్పల్ లో ఓ యువతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె ఇటీవల యుకే నుంచి హైదరాబాదు వచ్చింది. ఆమె తల్లిదండ్రులకు మాత్రం నెగెటివ్వచ్చింది.

హబ్సిగుడాలో రెండు కంటోన్మైంట్ జోన్లు ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీ నగర్ సర్కిల్స్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. 

ఇదిలావుంటే, హైదరాబాదులోని పాతబస్తీ భవానీనగర్ లో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో పాతబస్తీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. పాతబస్తీలోని తలాబ్ కట్ట తదితర ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. 

ప్రజల రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు బస్తీలవాసులను, కాలనీవాసులను హెచ్చరిస్తున్నారు.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి  ఈటెల రాజేందర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అదుపు చేయటానికి అనుసరించవలసిన వ్యూహం, ప్రస్తుత స్థితిగతులపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటైంది. 
click me!