జిహెచ్ఎంసీ ఎన్నికలు: సీపీ అంజనీ కుమార్ మీద ఎస్ఈసీకి బిజెపి ఫిర్యాదు

By telugu teamFirst Published Nov 27, 2020, 8:00 AM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీద ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ కు సీపీ మద్దతు ఇస్తున్నారని బిజెపి విమర్శించింది.

హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీద బిజెపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) ఫిర్యాదు చేసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంజనీ కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది.

అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు తెలిపినందుకు అంజనీ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని బిజెపి ఎస్ఈసీని కోరింది. అంజనీ కుమార్ మీడియా ప్రకటనలపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. 

హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని, బెంగళూరుతో పోటీ పడుతుందని అంజనీ కుమార్ అన్నట్లు బిజెపి గుర్తు చేసింది. ఈ విధమైన ప్రకటన చేయడం సరైంది కాదని తెలిపింది. హైదరాబాదులో మత ఘర్షణలు లేవని, కర్ఫ్యూలు లేవని సీపీ అనడాన్ని కూడా బిజెపి ఆక్షేపించింది. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండడానికే రోహింగ్యాలపై సీపీ మాట్లాడలేదని విమర్శించింది. 

ఇదిలావుంటే, ఓటు వేయడానికి ప్రజలు రాకుండా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యను ముందుకు తెస్తున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతిభద్రతల పేరుతో తమ పార్టీ జాతీయ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

కాగా, తనపై కేసు పెట్టడంపై బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య స్పందించారు. కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని ఆయన అన్నారు. తమపై ఎన్ని కేసులు పెడితే బిజెపి అంతగా పెరుగుతుందని ఆయన అన్నారు.

click me!