పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల కమలాకర్

By Siva KodatiFirst Published Oct 3, 2019, 3:01 PM IST
Highlights

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్‌ అన్నారు. 

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం నాడు బిసి కమిషన్‌ కార్యాలయంలో శ్రీ గంగుల కమలాకర్‌ పౌరసరఫరాల, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు శాఖల ద్వారా బడుగు బలహీనవర్గాలకు సేవచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాన్నారు.

గత ఐదేళ్లలో పౌరసరఫరాల శాఖలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసీఆర్ అక్రమాలకు అడ్డుకట్ట వేశారని కమలాకర్ గుర్తు చేశారు. ప్రజాపంపిణీ ద్వారా ఒక్క బియ్యం కూడా నల్లబజారుకు తరలకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో బీడు భూములు సైతం సాగులోకి  వచ్చాయని గంగుల కొనియాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

గతేడాది ఖరీఫ్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 55 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు గంగులకు శుభాకాంక్షలు తెలిపారు. 

click me!