Hyderabad: బిర్యానీ బాగోలేదంటే.. కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి... ఆరుగురు అరెస్టు..

By Rajesh KarampooriFirst Published Jan 2, 2024, 12:26 AM IST
Highlights

Hyderabad: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ కుటుంబం అబిడ్స్ గ్రాండ్ హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఆ బిర్యానీ సరిగ్గా ఉడకలేదని ఫిర్యాదు చేయడంతో అక్కడి సిబ్బంది వాగ్వాదానికి దిగారు.అది కాస్తా దాడికి దారి తీసింది. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది కస్టమర్లపై కర్రలతో దాడి చేశారు. 

Hyderabad: హైదరాబాద్ లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో కస్టమర్లపై ఆ హోటల్ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రాండ్ హోటల్‌లో కస్టమర్లపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ఆరుగురిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. దాడికి గురైన కస్టమర్లు దూల్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు.

వివరాల్లోకెళ్లే.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గత రాత్రి దూల్‌పేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అబిడ్స్ సర్కిల్ వద్ద ఉన్న గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. వారు మెను లిస్టును చూసి.. మటన్ జంబో బిర్యానీ కోసం ఆర్డర్ చేశారు. వెయిటర్ బిర్యానీ తెచ్చి కుటుంబ సభ్యులకు వడ్డించారు. వారు కొంత తిన్న తర్వాత అది సరిగా ఉడకలేదని హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వెయిటర్ బిర్యానీని వెనక్కి తీసుకుని.. వేడిచేసిన తర్వాత మళ్లీ తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. 

ఆ తర్వాత బిల్లు కట్టే సమయంలో బిర్యానీ సరిగ్గా లేదని చెప్పడంతో  అక్కడి సిబ్బంది కస్టమర్లతో వాదనకు దిగారు.  అకస్మాత్తుగా అక్కడ పనిచేస్తున్న ఇతర వ్యక్తులు తమపై కర్రలతో దాడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు మహిళలపై కూడా నిర్వాహకులు దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 324, 504, 509 ఆర్/డబ్ల్యూ కింద హోటల్ నిర్వాహకులు, వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉంది. మరోవైపు హోటల్‌లోని వెయిటర్‌లతో అసభ్యంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆరోపిస్తూ కుటుంబంపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

మరోవైపు.. ఈ ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. గ్రాండ్ హోటల్‌ లో కస్టమర్లపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు. 
 
గతంలో కూడా ఇలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరులో పంజాగుట్టలోని ఒక హోటల్‌లో 'రైత' విషయంలో జరిగిన గొడవ జరిగింది. చాంద్రాయణగుట్ట నివాసి అయిన 32 ఏళ్ల వ్యక్తిని హోటల్ వెయిటర్లు దాడి చేసి చంపారు.

click me!