సంక్రాంతి వేళ హైదరాబాదులో ఒకే రోజు 11 ఇళ్లలో చోరీలు

By telugu teamFirst Published Jan 18, 2020, 8:27 AM IST
Highlights

సంక్రాంతి పర్వదినం వేళ దొంగలు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లోని 11 ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు ముమ్మరమైన గస్తీ ఏర్పాటు చేసినప్పటికీ ఈ చోరీలు జరిగాయి.

హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో గస్తీ ముమ్మరం చేసినప్పటికీ దొంగలు ఒకే రోజు 11 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మీర్ పేట, ఆల్వాల్ ప్రాంతాల్లో ఈ చోరీలు జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని స్వస్థలాలకు వెళ్లేవాళ్లు ఇళ్లకు సరిగా తాళాలు వేసుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని రెండు పోలీసు కమిషనరేట్లు ప్రజలకు ముందే తెలియజేశాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద పోలీసులు గస్తీ తిరుగుతారని కూడా చెప్పారు. 

మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఒకే కాలనీలో దొంగలు ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. వెండి నగలను వదిలేసి వాళ్లు బంగారాన్ని, నగదును మాత్రమే ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో 30 నుంచి 35 సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. నిందితులను పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

తాళాలు వేసిన ఇళ్ల వద్ద సాయుధ సిబ్బందితో పాటు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ వ్యానులను నియోగించినట్లు రాచకొండ పోలీసులు చెప్పారు. ఏడు ఇళ్లలోకి దొంగలు చొరబడినప్పటికీ ఒక ఇంటిలో మాత్రమే వస్తువులను ఎత్తుకెళ్లారని డీసీపీ (క్రైమ్స్ పి. యాదగిరి చెప్పారు.  దాదాపు రూ. 80 వేల విలువ చేసే వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. వాటిలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా గస్తీని పెంచామని సైబరాబాద్ పోలీసులు కూడా చెప్పారు. ఆల్వాల్ లోని లక్ష్మినగర్ కాలనీలోని నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 13 తులాల బంగారాన్ని, 3 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. రెండు ఇళ్లలో మాత్రమే దొంగలకు అవి దొరికాయి. 

ఈ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పొందలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే అనుమానితుల వేలి ముద్రలు మాత్రం లభించాయని అంటున్నారు. ఇళ్లలో ఉన్న తీపిపదార్థాలను దొంగలు తిన్నారు.

click me!