రైతు భరోసా సొమ్ము పెంపు...ఎమ్మెల్యేలు ఏం చేయాలంటే: విజయసాయిరెడ్డి

By Arun Kumar PFirst Published Oct 14, 2019, 8:30 PM IST
Highlights

ఏపి ప్రభుత్వం ప్రారంభించనున్న రైతు భరోసా పథకానికి మంచి ప్రచారం కల్పించాలని వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు సూచించారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన భాద్యత స్థానిక ఎమ్మెల్యేలదే అని ఎంపీ విజయసాయి రెడ్డి  పేర్కొన్నారు.  వైఎస్సార్‌సిపి సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జి హోదాలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. 

''పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు మరియు ఇతర ముఖ్య నాయకులకు ముఖ్యమైన సందేశం... రైతుల భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌ ప్రకటించిన నిర్ణయం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, అందులోని ప్రతి మండలంలో పండుగ చేసుకోవాల్సిన సందర్భం.

 జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ రైతు భరోసా ద్వారా ఇచ్చే సొమ్మును రూ.12,500 నుంచి రూ. 13,500కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఎక్కడికక్కడ టపాసులు కాల్చండి. పండుగ వాతావరణాన్ని ఈరోజు, రేపు కూడా తీసుకురావాల్సిందిగా తద్వారా రైతులందరికీ ఈ విషయం చేరవేసే బాధ్యతను తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులందరికీ, పార్లమెంటు సభ్యులందరికీ మరియు ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 

మీమీ నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, మీడియాలో వచ్చిన వార్తలను పార్టీ కేంద్ర కార్యాలయంలో... వాట్సాప్‌ నంబర్లకు తప్పనిసరిగా ప్రతి శాసనసభ్యుడూ విధిగా పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.''  అంటూ విజయసాయిరెడ్డి పార్టీశ్రేణులకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. 
 

click me!