అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే...: నారా లోకేశ్

By Arun Kumar P  |  First Published Oct 15, 2019, 6:35 PM IST

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి నారా లోకేశ్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


గుంటూరు: దివంగత మాజీ ప్రధాని ఏపిజే అబ్దుల్ కలాం 88వ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాజీరాష్ట్రపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ  అబ్దుల్‌కలాంను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని లోకేశ్ సూచించారు.

ఈ సందర్భంగా లోకేశ్ విలేకరులతో మాట్లాడుతూ...  1931లో సామాన్యకుటుంబంలో పుట్టినవ్యక్తి, దేశరాష్ట్రపతిస్థాయికి ఎదిగిన వైనం  నేటితరానికి సదా స్ఫూర్తిదాయకమన్నారు. కలలు కనండి-వాటిని నిజం చేసుకునేవరకు అహర్నిశలు శ్రమించండి అని చెప్పడమేగాక, ఆచరణలో వాటిని సాధ్యంచేసి చూపించిన   మహనీయుడు అబ్దుల్‌కలాం అని ఆయన కొనియాడారు. 

Latest Videos

undefined

 ఇస్రో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా, 1980లో రోహిణి శాటిలైట్‌ని విజయవంతంగా లాంఛ్‌చేసినా, ప్రోఖ్రాన్‌-2 కార్యక్రమంలో ఇతరదేశాలకు తెలియకుండా రహస్యంగా అణుపరీక్ష జరిపించడంలో కలాం పాత్ర ఎంతో ఉందన్నారు. మనరాష్ట్రానికి చెందిన డాక్టర్‌  సోమరాజుతో కలిసి అతితక్కువధరకే పరికరాలు, మందులు అందేలా వైద్యరంగంలో ఎనలేని సేవలందించారని లోకేశ్‌ తెలిపారు.

2012లో నాటిప్రధాని వాజ్‌పేయ్‌ దేశ రాష్ట్రపతిగా ఎవరిని ఎంపికచేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు స్వర్గీయ అబ్దుల్‌ కలాం పేరుని సూచించడం జరిగిందన్నారు. అనంతరం చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి, మీరు దేశానికి రాష్ట్రపతి అయితే యువకులకు దిశానిర్దేశం చేయగలరని చెప్పి ఒప్పించిన విషయాన్ని లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు.

 తాను కన్న కలలను నిజంచేసుకోవడానికి రేయింబవళ్లు శ్రమించిన వ్యక్తి కలాం... ఆయన  ఆలోచనలు, ఆశయాలను నేటియువత ప్రతిక్షణం స్మరించుకోవాలని లోకేశ్‌ సూచించారు.  పరిపూర్ణమైన భారతీయుడు కలాం అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావు మాట్లాడుతూ... పేదకుటుంబలో పుట్టి, పేపర్‌బాయ్‌గా పనిచేసిన వ్యక్తి, అత్యున్నత శిఖరాలను అధిరోహించి, రాష్ట్రపతిగా విశేష సేవలందించిన ఘనత స్వర్గీయ ఏపీజే అబ్దుల్‌కలాంకే దక్కుతుందన్నారు. ఆయన చిన్నతనంలో అనేక కష్టాలుపడి విద్యాభ్యాసం సాగించారని, కృతనిశ్చయంతో, ఒక లక్ష్యంతో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. 

శాస్త్ర,సాంకేతిక రంగాలతో పాటు, వైద్యరంగంలో కూడా అబ్దుల్‌కలాం విశేషసేవలందించారని తెలిపారు.  దేశంకోసం, ప్రజలకోసం తనజీవితాన్ని త్యాగంచేసి, పరిపూర్ణమైన భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయిన గొప్పవ్యక్తి  స్వర్గీయ కలాం అని వెంకట్రావు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్రబాబు, వట్టికూటిహర్షవర్థన్‌, షేక్‌బాజీ, షేక్‌హుస్సేన్‌, కనపర్తిశ్రీనివాస్‌, కసుకుర్తి హనుమంతరావు, మన్నవకోటేశ్వర్రావు, సోమశేఖర్‌, మాజీకార్పొరేటర్లు ముత్తినే ని రాజేశ్‌, గోళ్లప్రభాకర్‌, జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి,  దయారత్నం, పప్పుల దేవదాసు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 
 
 

click me!