ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి: సోమిరెడ్డి

By Arun Kumar PFirst Published Oct 31, 2019, 3:19 PM IST
Highlights

మీడియా స్వేచ్చను హరించేలా జగన్ ప్రభుత్వం చర్యలు వున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఇలాంటి నిరంకుశ చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. 

నెల్లూరు : 2007లో వైఎస్ పత్రికా స్వేచ్చను హరించే విధంగా జీవో నెంబరు 938 తెచ్చారని.. ప్రతిపక్షాల పోరాటంతో అప్పుడు ఆ జీవోని నిలుపుదల చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్లీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా జీవో నెంబరు 2430 తెచ్చిందని విమర్శించారు. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ పాలన ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పాలన చూస్తుంటే ఎమర్జెన్సీ పాలన గుర్తుకొస్తుందన్నారు. వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం, కేసులు పెట్టడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

జగన్ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకి తెరతీశారని, అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేసిందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ సీనియర్ ఐఏఎస్ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. 

read more  మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబర్దార్‌... జగన్ పార్టీకి మాజీ మంత్రి వార్నింగ్

ఇసుక కొరతతో రాష్ట్రంలో పనులు లేక కుటుంబాన్ని పోషించుకోలేక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు బయపడుతున్నారని, గత ప్రభుత్వ హాయాంలో జరిగిన పనుల బిల్లులను త్వరగా విడుదల చేయాలని సోమిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

ఇటీవల ప్రకాశం జిల్లా పర్చూరులో ఓ మీడియా సంస్థకు చెందిన సిబ్బందిపై  వైఎస్సార్‌సిపి దాడి చేసినట్లు మాజీ మంత్రి, టిడిపి నాయకులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.   ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని... జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా, జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు.

read more  ఈనాడుకు ప్రభుత్వ యాడ్స్ ఎందుకు ఇస్తున్నామంటే..: బొత్స
 
అధికార గర్వం కేవలం వైఎస్సార్‌సిపి నాయకత్వానికే కాదు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు కూడా పాకిందని  శ్రీనివాసులు ఆరోపించారు. అందువల్లే తమకు అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని... ఇలాంటి చర్యలను ఆపాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కాల్వ మండిపడ్డారు. 

 ముఖ్యంగా మీడియా సంస్థలు, ప్రతినిధులపై ఆంక్షలు, వేధింపులకు గురిచేసి పత్రికా స్వేచ్ఛను హరించిస్తున్నాయని అన్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేయటానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు అబాసు పాలవ్వడం చరిత్రలో చూశామని... ఈ పార్టీకి అదేగతి పడుతోందని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ ప్రవర్తన చరిత్రను తిరగతోడేలా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కనపడనీయకుండా చేయాలని మీడియాను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీకి పెరుగుతున్న ప్రజల మద్ధతు నుంచి పక్కదారి పట్టించాలని వైసిపి నేతలు జర్నలిస్టులపై దాడులు, కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విలేకర్లు, పత్రికలు స్వేచ్ఛగా పని చేసుకున్నాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో మీడియా సంస్థలకు ఎప్పుడు కూడా అడ్డురాలేదన్నారు. 
  

click me!