పవన్ కల్యాణ్ ను అడ్డుకుంటారా... నేనూ అదే చేసుంటే...: జగన్ పై చంద్రబాబు ఫైర్

By Arun Kumar P  |  First Published Jan 1, 2020, 1:46 PM IST

అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ నిరసన చేపడితే  పోలీసుల చేత అడ్డుకోడాన్ని టిడిపి అధినేత చంద్రబాబు తప్పుబట్టారు.   


అమరావతి రైతులకు మద్దతుగా నిలిచి స్వయంగా నిరసనబాట పట్టిన జనసేన అధ్యక్షులు, సినీ నటులు పవన్ కళ్యాణ్ ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అడ్డుకుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలీసులను ఉపయయోగించి శాంతియుతంగా సాగుతున్న పవన్ పర్యటనను అడ్డుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 

 ''ఏపి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 15రోజులుగా నిద్రాహారాలు మాని ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు, రైతుకూలీలు, మహిళలకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం అనైతికం, అప్రజాస్వామికం. 

Latest Videos

రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలు, రైతు కూలీలకు అండగా ఉండేందుకు వెళ్లడం పవన్ కళ్యాణ్ చేసిప  నేరమా..? బాధిత కుటుంబాలకు సంఘీభావం చెప్పడం ఆయన చేసిన పాపమా..? బాధితుల పరామర్శకు వెళ్లే ప్రతిపక్ష నాయకులు వెళ్లడాన్ని అడ్డుకోవడం ఎక్కడైనా ఉందా..?'' అని చంద్రబాబు వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

''తుళ్లూరుకు వెళ్లకుండానే మధ్యలోనే ఆయన పర్యటనకు ప్రతిబంధకాలు సృష్టించడం వైసిపి ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట. ఆయనతో పాటు నిరసనలో పాల్గొన్న వేలాది మంది రైతులు, రాజధాని ప్రాంత ప్రజలను కూడా నానా ఇబ్బందు సృష్టించారు. తమ సమస్యలను తెలియజేసే హక్కు కూడా ప్రజలకు లేదా'' అని చంద్రబాబు నిలదీశారు. 

''గత 7నెలలుగా రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను సమస్యల్లో ముంచేశారు. రైతుల సమస్యలు, ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, వందలాది చిరుద్యోగుల ఆత్మహత్యా యత్నాలు,  నిత్యావసరాల ధరల పెరుగుదల, వైసిపి నేతల భూకబ్జాలు, మద్యం మాఫియా ఆగడాలు...రాష్ట్రాన్ని సమస్యల మయం చేశారు. సమస్యల పరిష్కారం చేతగాక వాటిని మించిన సమస్యలను సృష్టించి మరిన్ని ఇబ్బందుల్లోకి ప్రజలను నెడుతున్నారు'' అని అన్నారు.

''శాసన సభలో టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, కేబుల్ టీవిలో కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపేయడం, అసెంబ్లీ ప్రసారాలకు 2 చానళ్లను అనుమతించక పోవడం, మీడియాపై ఆంక్షలు విధిస్తూ జివో 2430 విడుదల చేయడం, అమరావతి పరిరక్షణ సమితి జెఏసి ధర్నాకు వెళ్తున్న టిడిపి ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్ చేయడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి అమరావతి పర్యటనపై రాళ్లు వేయించడం, మరో ప్రతిపక్షం జనసేన నేత పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడం ఇవన్నీ  వైసిపి ప్రభుత్వ దమన చర్యలకు ప్రత్యక్ష సాక్ష్యాలు'' అని మండిపడ్డారు. 

''పోగాలం దాపురిస్తే ఇటువంటి దుష్టబుద్దులే పుడతాయి. వీటన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇకనైని ప్రభుత్వం తమ తప్పులు  సరిదిద్దుకుంటే మంచిది'' అని చంద్రబాబు హెచ్చరించారు.

''రాజధాని రైతులకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు ఒక్కరు కూడా భయటకు రాలేదూ..రాజధాని రైతులకు అన్యాయం జరగాలని విశాఖ ప్రజలు కోరుకోవడం లేదు. అమరావతి ఒక పుణ్యక్షేత్రం... ఎవ్వరైనా ఈ ప్రాంతానికి చెడు చేస్తే వారే నాశనం అయిపోతారు.పవన్ కల్యాణ్ పర్యటనకు ఆంక్షలు విదిస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు నేనూ ఆంక్షలు పెట్టి ఉంటే పాదయాత్ర జరిగేదా...ప్రజలే రక్షణగా ఉండి పవన్ కల్యాణ్ ని తీసుకెళ్లడం జరిగింది'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

''అసలు పవన్ కల్యాణ్ ను ఆపే అధికారం ప్రజలకు ఎవ్వరిచ్చారు. ప్రజలు తిరగబడితే జగన్ పులివెందుల పాలిపోతారు..సెక్యురిటి లేనిదే జగన్ భయటకు వచ్చే ధైర్యం చేయలేరూ. నా మీద అలిపిరి ఘటన జరిగిన తర్వాత కూడా ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి పోరాడడం జరుగుతుంది'' అని చంద్రబాబు తెలిపారు.  

click me!