రాజధాని తరలింపును నిరసిస్తూ గత నెల రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు మద్ధతు పలికారు
రాజధాని తరలింపును నిరసిస్తూ గత నెల రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు మద్ధతు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని గుర్తుచేశారు. రైతులందరికీ న్యాయం చేస్తామని, భూములిచ్చిన వారందరికీ అన్యాయం జరగకూడదని ఎంపీ తెలిపారు.
Also Read:ఎన్టీఆర్ టైమ్ లో కూడా జరిగింది: శాసన మండలి రద్దుపై తమ్మినేని
న్యాయం జరిగే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని, వైసీపీ నుంచి త్వరలోనే ఓ కమిటీ రైతుల వద్దకు వస్తుందన్నారు. రైతులకు ఈ భూమలు తరతరాలుగా ఆస్తులుగా వచ్చాయని.. భూములిచ్చిన రైతులు ఎమోషనల్ గానే ఉంటారని కృష్ణదేవరాయలు తెలిపారు.
రైతులందరికీ న్యాయం చేసే బాధ్యత తామే తీసుకుంటామని ఎంపీ స్పష్టం చేశారు. త్వరలోనే కమిటీ వేస్తారని, వారు వచ్చినప్పుడు రైతుల సమస్యలను తెలియజేయాలని ఆయన సూచించారు.
దూరంగా పోతే సమస్య పరిష్కారం కష్టమవుతుందని, రైతులందరికీ ఎమోషన్ ఉందని రెండువైపులా ఓ మాట తూలవచ్చునని కృష్ణదేవరాయలు అభిప్రాయపడ్డారు. రైతులు సంయమనం పాటించాలని కోరుతున్నానని, మాట వెనక్కి తీసుకోవడం కష్టమేనని ఆయన అన్నారు.
రైతులకు నష్టం జరగాలని ఎవరికీ ఉండదని.. అయితే వారు ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలని వేడుకుంటున్నానని ఎంపీ చెప్పారు. రైతులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నానని.. కమిటీలో నాకు అవకాశం ఇస్తే తాను కూడా తప్పకుండా వస్తానని లావు హామీ ఇచ్చారు.
Also Read:జగన్ కన్నా.. చంద్రబాబే నయం... మెగా బ్రదర్ నాగబాబు
అయితే అమరావతి ని రాజధానిగా కొనసాగిస్తేనే చర్చలకు వస్తామని రైతులు స్పష్టం చేశారు. అమరావతిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయాల్సిందిగా మందడం రైతులు లావు శ్రీకృష్ణదేవరాయలను నిలదీశారు. రైతులకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ నేతలు ఎంపీని కోరారు.