వైఎస్ పాలనలో సైకోయిజం చూశామని, వైెఎస్ జగన్ పాలనలో సైకోయిజం చూస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
గుంటూరు: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆయన శనివారం పర్యటించారు. ఆంధ్ర రాష్ట్రంలో రక్షాస పాలన కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు.
వైఎస్ హాయాంలో ఫ్యాక్షనిజం చూశామని, జగన్ హయాంలో సైకోయిజం చూస్తున్నామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి సైకోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్మశానాలకు రంగులు వెయ్యడం పూర్తి అయ్యిందని, ఇక వైకాపా ప్రభుత్వాన్ని చూస్తుంటే పోలీస్ స్టేషన్లకు వైకాపా రంగులు వేసి పోలీసులకు వైకాపా రంగులతో యూనిఫామ్ కుట్టించేలా ఉన్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసులపై ఒత్తిడి చేశామా అని ప్రశ్నించారు. ఆధికారం శాశ్వతం కాదని అన్నారు.
రైతు భరోసా ఎవరికిచ్చారని లోకేష్ నిలదీశారు. బెల్టు షాపులు రద్దు అన్నారు గానీ బెల్టు షాపులు గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అన్నారు. ఇసుక అందుబాటులో లేదని అన్నారు. తప్పుడు కేసులకు టిడిపి కార్యకర్త శ్రీనివాస్ బలయ్యాడని అన్నారు.
శ్రీనివాస్ ఆత్మహత్య కి కారణం అయిన వైకాపా నాయకులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు అండగా తాము ఉన్నామని,.అక్రమ కేసులు పెడుతున్న వారిపై ప్రైవేట్ కేసులు పెడతామని అన్నారు.