పెళ్లైన నెల రోజులకే తన భార్య కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త షేక్ మహమ్మద్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే కేసులు పెట్టి వేధిస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించాడు భర్త.
గుంటూరు: తమ ప్రేమకు కుల మతాలు అడ్డుకాదనుకున్నారు. అవసరమైతే వాటిని ఎదిరించి అయినా సరే పెళ్లి చేసుకోవాలని భావించారు. అదృష్టం కొద్దీ ఇరుకుటుంబాలు ప్రేమపెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2012లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
పెద్దల ఒప్పందంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటపై ఎవరి కన్నుకుట్టిందో ఏమో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మని భర్త ఏడేళ్లుగా ప్రాధేయపడుతున్నా ఆ ఇల్లాలు కరుణించడం లేదని భర్త ఆరోపిస్తున్నారు.
undefined
పెళ్లైన నెల రోజులకే తన భార్య కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త షేక్ మహమ్మద్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే కేసులు పెట్టి వేధిస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించాడు భర్త.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు అర్బన్ అంకమ్మ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ హుస్సేన్ గుంటూరు రూరల్ మండలం లాలూపురం గ్రామానికి చెందిన నీరజ ప్రియాంక ఇద్దరూ ప్రేమించుకున్నారు.
పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకుని పట్టుమని నెల రోజులు కూడా తన భార్య తనతో ఉండకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు షేక్ మహమ్మద్ హుస్సేన్.
జీవితాంతం తోడుగా ఉంటుందని భావించి పెళ్లి చేసుకుంటే తనను అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిందని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాపురానికి రావాలని ఎన్నిసార్లు కోరినా లెక్కచేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పటి నుంచి ఏడేళ్లుగా తనపై అనేక కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. రూ.10 లక్షలు ఇస్తే పెట్టిన కేసులు రాజీ పడతానని స్పష్టం చేసిందని తెలిపారు. తన భార్య వ్యవహారశైలి కారణంతో తమ కుటుంబమంతా నరకయాతన అనుభవిస్తుందన్నారు.
వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులు సైతం అనారోగ్యంతో బాధపడుతూ కుమిలిపోతున్నారని ఆరోపించారు. తన సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని పోలీసులు చేతులు దులుపుకున్నారని చెప్పుకొచ్చారు. తన సమస్యపై అర్బన్ ఎస్పీ రామకృష్ణ స్పందించి న్యాయం చేయాలని కోరారు.