చత్తీస్గడ్ : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూసే విచిత్రమైన ఆచారాలు, సంప్రదాయాలు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి విచిత్రమైన ఆచారమే ఛత్తీస్గఢ్లోని ఓ గిరిజన తెగలో ఉంది.
ఆ తెగలో పెళ్లి సమయంలో వరుడికి కట్నంగా పాములను ఇస్తారట. ఇదెక్కడి చోద్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వారి తెగలో వందల ఏళ్లుగా ఆచారంగా వస్తున్నదట.
మామూలుగా పెళ్లిలో కట్నంగా అల్లుడికి బంగారమో, డబ్బో, పొలాలో, ఇల్లో.. ఆస్తులో కట్టబెట్టడం మామూలుగా కనిపిస్తుంది. కానీ, వీరి తెగలో మాత్రం పాములనే కట్నాలుగా ఇస్తారట.
సన్వారా తెగలో అయితే పెళ్లిల్లో వధువు తరపు వారు వరుడికి రకరకాల జాతులకు చెందిన పాములను కట్నంగా ఇచ్చుకుంటారట.
కట్నంగా పాములను ఇచ్చే స్తోమత లేని ఆడపిల్లను ఆ తెగలో ఎవరు పెళ్లి చేసుకోరట. వరకట్నంగా మొత్తంగా తొమ్మిది రకాల జాతులకు చెందిన ఇరవై ఒక్క పాములను ఇస్తారు.
దీని గురించి ఆ తెగకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘మా పూర్వీకులు.. ఇలా పెళ్లి సమయంలో వరకట్నంగా 60 పాముల వరకు ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు.. పాముల సంఖ్య తగ్గిపోవడంతో.. కట్నంగా ఇచ్చే వాటి సంఖ్య తగ్గిపోయింది’ అని కటంగి అని గిరిజనుడు చెప్పుకొచ్చాడు.
ఇంతకీ ఇలా పాములను ఎందుకు ఇస్తారు అంటే…‘పాములను ఆడించడమే వారి జీవనాధారం. వారి భుక్తికి మార్గం. అందుకే వరకట్నంగా పాములను ఇస్తుంటారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని… స్థానిక సంప్రదాయాలను గౌరవించే ప్రభుత్వం కూడా… ఇలా పాములను కట్నంగా ఇవ్వడానికి అనుమతులు ఇస్తుంది’ అని అక్కడి అటవీ రేంజ్ అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు.