
Phone Battery Life : స్మార్ట్ ఫోన్... ఈ టెక్నాలజీ యుగంలో మనిషి జీవితంలోకి ప్రవేశించిన పవర్ ఫుల్ పరికరం. ఓ మనిషి జీవించాలంటే ఒకప్పుడు కూడు,గూడు, గుడ్డ తప్పనిసరి... కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి ఫోన్ కాదుకాదు స్మార్ట్ ఫోన్ వచ్చింది చేరింది. ఈ ఫోన్ వాడకానికి ధనవంతులు, పేదవారు అన్న తేడాలేదు... డబ్బున్నోళ్లు లక్షల విలువచేసేవి వాడితే... పేదోళ్ళు వేల విలువచేసేవి వాడతారంతే... కానీ స్మార్ట్ ఫోన్ వాడటం మాత్రం పక్కా. ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండానే పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు మొబైల్ కల్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఫోన్ లేదంటే మనిషి జీవితమే సాగదన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.
ఇలా స్మార్ట్ ఫోన్లపై మనిషి జీవితమే ఆదారపడింది... కాబట్టి ప్రతిఒక్కరు తమ ఫోన్ ఎప్పుడూ ఆన్ లోనే వుండాలని కోరుకుంటారు. ఇంట్లో వున్నపుడు ఓకే...కానీ బయటకు వెళ్ళినపుడు సడన్ చార్జింగ్ అయిపోతే ఎలా..? ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి. కాబట్టి ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుండాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ చూస్తారు.
మీ ఫోన్ ఛార్జింగ్ చిట్కాలు :
స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేసేది డిస్ ప్లే. ఒక్క మొబైల్స్ లోని కాదు ఎలక్ట్రానిక్ డివైజ్ లో ఛార్జింగ్ తగ్గడానికి ఎక్కువగా కారణమయ్యేది డిస్ ప్లే. కాబట్టి మీ ఫోన్ బ్రైట్ నెస్ వీలైనంత తక్కువగా పెట్టుకొండి. ముఖ్యంగా బయటకు వెళ్లిన సమయంలో చాలామంది ఫోన్ బ్రైట్ నెస్ పూర్తిగా పెంచుకుంటారు. అలా కాకుండా అవసరమైన సమయంలో మాత్రమే బ్రైట్ నెస్ పెంచుకుంటే బ్యాటరీ ఎక్కవసేపు వుంటుంది.
ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించడం ఆపగానే ఆటోమేటిక్ గా స్క్రీన్ ఆఫ్ అవుతుంది. ఈ స్క్రీన్ ఆఫ్ సమయాన్ని వీలైనంత తక్కువ వుండేలా చూసుకొండి. దీనివల్ల ఛార్జింగ్ వృధాకాకుండా ఎక్కువసేపు వస్తుంది.
అవసరం వున్నా లేకపోయినా మన ఫోన్లలో లెక్కకుమించిన యాప్స్ వుంటాయి. అయితే కొన్ని యాప్స్ ఉపయోగించకున్నా మన బ్యాటరీని ఉపయోగిస్తుంటాయి. ఇలాంటి యాప్స్ అవసరం లేకుంటే వెంటనే డిలీట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే అనవసరమైన యాప్స్ అన్నింటిని మన మొబైల్ నుండి డిలీట్ చేస్తే మంచింది. ఇది సెక్యూరిటీ పరంగానే కాదు బ్యాటరీ లైఫ్ పరంగాను మంచింది. ఏ యాప్స్ ఎక్కువగా బ్యాటరీని ఉపయోగించాయో చూసుకునే ఆప్షన్ ప్రతి ఫోన్ లోనూ వుంటుంది. ఓసారి చూసుకొండి.
మనం ఫోన్ ఉపయోగించకున్నా బ్యాగ్రౌండ్ లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. దీంతో మనం ఫోన్ వాడకున్నా బ్యాటరీ తగ్గుతూ వుంటుంది. ఇలా మీ ఫోన్ లో కూడా జరుగుతుంటే వెంటనే బ్యాగ్రౌండ్ లో రన్ అయ్యే అప్లికేషన్లను నిలిపివేయండి.
ఇక మీరు వాడే ఛార్జర్ ను బట్టికూడా బ్యాటరీ పనితీరు ఆధారపడి వుంటుంది. చాలామంది చేసే తప్పు ఏమిటంటే...అందుబాటులో ఏ ఛార్జర్ వుంటే దాంతో ఛార్జింగ్ చేస్తుంటారు. ఇలా చేయడంవల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. కాబట్టి మన ఫోన్ తో పాటు వచ్చే చార్జింగ్ ను వాడటంవల్ల బ్యాటరీ లైఫ్ బావుండి ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు వుంటుంది.
స్మార్ట్ ఫోన్లలో పవర్ సేవింగ్ మోడ్ అనే ఆప్షన్ వుంటుంది... కానీ దాన్ని మనం బ్యాటరీ తక్కువగా వున్న సమయంలోనే వాడతాం. అలాకాకుండా ఎప్పుడూ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ లో వుంచండి. ఇది బ్యాటరీ లైఫ్ ను మెరుగు పరుస్తుంది.
ఇక మీ ఫోన్ లో చార్జింగ్ ఎప్పుడూ 20 శాతానికి తగ్గకుండా, 90 శాతానికి పెరగకుండా చూసుకొండి. ఇది మెయింటేన్ చేస్తే బ్యాటరీ లైఫ్ బావుంటుంది.
ప్రస్తుతం 5జి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే 5జి ఉపయోగించడం ద్వారా కూడా ఎక్కువ పవర్ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం వున్నపుడు మాత్రమే 5జి స్పీడ్ ఉపయోగించి...మిగతా సమయంలో 4జి ఆన్ లో పెట్టుకొండి.
ఇక చార్జింగ్ చేసే సమయంలో ఫోన్ ఉపయోగించడం మంచిది కాదు. అలాగే బాగా వేడి, బాగా చలి పరిస్థితుల్లోనూ ఫోన్ ఉపయోగం మంచిదికాదు. ఫోన్ హీటెక్కకుండా జాగ్రత్త పడాలి. వైబ్రేషన్ మోడ్ కంటే రింగ్ టోన్ మోడ్ తక్కువ బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇలా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మన ఫోన్ బ్యాటరీ లైఫ్ ను మెరుగుపర్చుకోవచ్చు. తద్వారా ప్రతిసారి పవర్ బ్యాంకులు, ఛార్జర్లు వెంటపెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం వుండదు.