Novak Djokovic: ఆస్ట్రేలియానే కాదు.. అలా చేయకుంటే మేమూ రానియ్యం.. జొకోవిచ్ కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్

First Published | Jan 18, 2022, 11:44 AM IST

French Open 2022: కరోనా వ్యాక్సిన్ వేసుకోక ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి అక్కడ ఆ దేశ ప్రభుత్వంతో పోరాడి ఓడిన ప్రపంచ  టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ కు  షాక్ ఇవ్వడానికి ఫ్రాన్స్ కూడా సిద్ధమైంది. 

ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొని 21వ గ్రాండ్ స్లామ్ కొట్టేయాలనుకున్న ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ (పురుషుల) నోవాక్ జొకోవిచ్ కు కంగారూల దేశం షాకిచ్చిన విషయం తెలిసిందే. 
 

వ్యాక్సిన్ వేయించుకోకుండా తమ దేశంలో అడుగుపెట్టిన జొకోవిచ్ కు ఆస్ట్రేలియా.. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.  వీసాను రద్దు చేయడమే గాక ఏకంగా దేశం నుంచి పంపించివేసింది. దీంతో అతడి ఆశలు అడియాసలే అయ్యాయి. 
 


ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనకుండానే తిరిగి  తన స్వదేశం  సెర్బియాకు వెళ్లిన జొకోవిచ్ కు షాక్ ఇవ్వడానికి  ఫ్రాన్స్ కూడా సిద్ధమైంది. వ్యాక్సిన్ వేసుకోకుంటే  తమ దేశంలోకి ఎవ్వరినీ అనుమతించబోమని ఫ్రాన్స్ తెలిపింది.

ఈ మేరకు ఆదివారం ఆ దేశ పార్లమెంటు ఏకంగా చట్టాన్నే ఆమోదించింది. దీని ప్రకారం.. ఫ్రాన్స్ కు వెళ్లాలనుకున్నవారైనా, అక్కడి ప్రజా సమూహాలలో తిరిగే వారైనా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి.  అధికారులు అడిగిన వెంటనే వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాలి. 

అలా చేయని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందించింది ఫ్రాన్స్. ఆదివారం దీనిని పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించింది. 

దీంతో జొకోవిచ్ కు మరో షాక్ తగిలినట్టే. వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపని జొకో.. ఆ కారణంగానే ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి దూరమయ్యాడు. ఇక అతడు ఇలాగే మొండిగా ఉంటే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి కూడా తప్పుకోవాల్సి  వస్తుంది. ఈ ఏడాది మే-జూన్ లో  ఫ్రెంచ్ ఓపెన్ జరగాల్సి ఉంది. 
 

ఇదే విషయమై ఫ్రాన్స్ క్రీడా మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘ఈ నియమం చాలా సులభం. ఇప్పటికే హెల్త్ పాస్ కు లోబడి ఉన్న సంస్థల్లో చట్టం ప్రకటించిన వెంటనే వ్యాక్సిన్ పాస్ విధించబడుతుంది. ఇది సాధారణ ప్రేక్షకుడికైనా.. వృత్తిపరమైన క్రీడాకారుడికైనా అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది.

ఇక రోలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్ ను ఇలా పిలుస్తారు) విషయానికొస్తే.. అది మేలో  జరగాల్సి ఉంది. అప్పటివరకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికైతే మినహాయింపులు ఏమీ లేవు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే..’ అని తెలిపింది. 
 

దీంతో జొకోవిచ్ కు స్పష్టమైన హెచ్చరికను చెప్పకనే చెప్పింది ఫ్రాన్స్. వ్యాక్సిన్ వేసుకోకుంటే ఆస్ట్రేలియాలోనే కాదు.. ఫ్రెంచ్ ఓపెన్ లో కూడా ఆడించబోమని హెచ్చరించింది. మరి ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుని అబాసుపాలైన జొకో.. ఫ్రెంచ్ ఓపెన్ వరకైనా  వ్యాక్సిన్ వేసుకుంటాడా..? లేదా..? అన్నది అతడి అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.  
 

Latest Videos

click me!