ఫ్రెంచ్ ఓపెన్ మొదటి రౌండ్‌లో రొమేనియా ప్లేయర్ పాట్రికా మారియాటిగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని అందుకుంది నవోమి ఒసాకా. అయితే ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆమె పాల్గొనలేదు.
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిబంధనల ప్రకారం మ్యాచ్ అనంతరం ప్రతీ ప్లేయర్ తప్పనిసరిగా మీడియా సమావేశంలో పాల్గొనాలి. లేదంటే భారీ జరిమానాతో పాటు టోర్నీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉంది. మొదటి రౌండ్‌లో మీడియా సమావేశంలో పాల్గొనందుకు నవోమి ఒసాకాకి 15 వేల డాలర్లు జరిమానా విధించారు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహాకులు.
అయితే ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే ఒసాకి, తాను మీడియా సమావేశాలకు హాజరుకానని స్పష్టం చేసింది. ‘మీడియా సమావేశం ఆసక్తికరంగా, ఆటగాళ్లల్లో ఉత్సాహాన్ని నింపేలా సాగాలి. కానీ మీడియా నన్ను బాధపెట్టే ప్రశ్నలు వేస్తూ, నన్ను మానసికంగా కృంగదీస్తున్నారు. అందుకే నా మానసిక ఆరోగ్యం కోసం మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది నవోమి ఒసాకా.
మొదటి రౌండ్‌లో సునాయాస విజయం సాధించినా, మీడియా సమావేశానికి హాజరుకాకపోవడంతో జరిమానా పడడంతో ఆ తర్వాతి రోజే ఏకంగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది ఒసాకా.
‘నా కెరీర్‌లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అయితే కొన్నాళ్లుగా మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. 2018 యూఎస్ ఓపెన్ నుంచి డిప్రెషన్‌లో ఉన్నా. నేను ఓ అంతర్ముఖురాలిని.
ఎవరితో అంత ఈజీగా కలవలేను. నేను ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండడానికి కారణం ఇదే. సోషల్ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి హెడ్ ఫోన్స్‌ను వాడుతున్నా. టెన్నిస్ ప్రెస్ నాతో ఎప్పుడూ మంచిగానే ఉన్నారు. నాతో ఎంతో కూల్‌గా మాట్లాడిన కొందరు జర్నలిస్టులకు క్షమాపణలు కూడా చెప్పాలనుకుంటున్నా.
నేను ఇప్పటికే పారిస్‌లో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా. అందుకే ప్రెస్ కాన్ఫిరెన్స్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ రూల్స్ సరైనవా? కావా? అని మాట్లాడే స్టేజ్‌లో నేను లేను.
ఇప్పటికైతే కొన్నాళ్ల పాటు టెన్నిస్ కోర్టుకి దూరంగా ఉండాలని అనుకుంటున్నా. టెన్నిస్ ప్లేయర్లు సౌకర్యంగా ఫీల్ అయ్యేలా ఏం చేయాలో, ఎలా చేయాలనేదానిపై మాట్లాడాలనుకుంటున్నా...’ అంటూ సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసింది నవోమీ ఒసాకా.
2019, 2021 సీజన్లలో ఆస్ట్రేలియాన్ ఓపెన్ గెలిచిన 23 ఏళ్ల నవోమీ ఒసాకా... 2018, 2020 సీజన్లలో యూఎస్ ఓపెన్ గెలిచింది. 2019లో ఫ్రెంచ్ ఓపెనర్ రన్నరప్‌గా నిలిచిన నవోమీ ఒసాకా, 2021 సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.