నేను రిటైర్ కాలేదు.. నా నుంచి టెన్నిస్‌ను ఎవరూ వేరుచేయలేరు.. మళ్లీ వస్తా.. సెరెనా సంచలన వ్యాఖ్యలు

First Published Oct 25, 2022, 1:37 PM IST

Serena Williams:  కొద్దిరోజుల క్రితం ముగిసిన  యూఎస్ ఓపెన్  తర్వాత ఆటకు గుడ్ బై చెప్పిందని అంతా భావిస్తున్న తరుణంలో  అమెరికా నల్లకలువ  సెరెనా విలియమ్స్ అందరికీ షాకిచ్చింది. 

ప్రపంచ టెన్నిస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న  దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్  తాను  ఆట నుంచి రిటైర్ కాలేదని  స్పష్టం చేసింది. యూఎస్ ఓపెన్ - 2022 నుంచి  మూడో రౌండ్ లో నిష్క్రమించిన ఆమె.. మళ్లీ తాను గ్రౌండ్ లో అడుగుపెట్టడం ఖాయమని హింట్ ఇచ్చింది.  

యూఎస్ (శాన్ ఫ్రాన్సిస్కో)లో తన ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కు  సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.   తాను రిటైర్ అయ్యానని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. తన ఇంట్లో  ప్రాక్టీస్ చేస్తున్నానని.. ఆట నుంచి  తనను ఎవరూ విడదీయలేరని చెప్పింది. 

సెరెనా మాట్లాడుతూ.. ‘నేను రిటైర్ కాలేదు.  నేను  తిరిగి టెన్నిస్ కోర్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావాలంటే మీరు నా ఇంటికి రండి.. అక్కడ ఓ టెన్నిస్ కోర్టు ఉంది.  నేను అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను..’ అని తెలిపింది ఈ 41 ఏండ్ల ఛాంపియన్. 

తన కెరీర్ లో ఏకంగా 23 గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన సెరెనా.. తనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడటమంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ - 2023లో ఆమె  ఆడే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చింది. 
 

‘అసలు నేను దాని (రిటైర్మెంట్) గురించి పట్టించుకోవడం లేదు. నేను  ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుడూ ఎంత బిజిగా ఉండేదాన్నో ఇప్పుడూ అంతే బిజీగా ఉన్నా. ప్రతీ రోజూ నా తొలి రోజు ఆటలాగే భావిస్తున్నా. అయితే ఇన్నాళ్లు  ప్రాక్టీస్ చేసిన ప్రతీసారి ఏదో ఒక ఈవెంట్ లో పోటీ పడేదాన్ని. కానీ ఇప్పుడు ఏ పోటీ లేకుండా నాతో నేనే టెన్నిస్ ఆడుకోవడం వింతగా అనిపిస్తున్నది. కానీ నేను నా మునపటి లయను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నా..’అని తెలిపింది. 

కాగా కొద్దిరోజుల క్రితం యూఎస్ వేదికగా ముగిసిన యూఎస్ ఓపెన్ - 2022లో సెరెనా మూడో రౌండ్ లోనే నిష్క్రమించింది. అయితే ఈ మెగా టోర్నీలో ఆమె ఆడిన ప్రతీ మ్యాచ్ ను నిర్వాహకులు ఓ కార్నివాల్ లా సెలబ్రేట్ చేశారు. 

మూడో రౌండ్ లో ఆమె ఓడిన తర్వాత కూడా  సెరెనా రిటైర్ అయినట్టేనని.. టెన్నిస్ కోర్టు మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం.. నిర్వాహకులు ఆమె ఘనతలకు సంబంధించిన విషయాలను టీవీ స్క్రీన్ ల మీద ప్రదర్శించడం వంటివి  ఆమె  చివరి మ్యాచ్ గానే సూచించాయి. కానీ తాజాగా సెరెనా మాత్రం  తానింకా రిటైర్ కాలేదని చెప్పడం గమనార్హం. 

click me!