Wimbledon: వ్యాక్సిన్ వేసుకోలేదు.. వేసుకునే ప్రసక్తే లేదు.. అయినా యూఎస్ ఓపెన్ ఆడతా: జొకోవిచ్

First Published | Jul 11, 2022, 2:31 PM IST

Novak Djokovic: ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఓ గ్రాండ్ స్లామ్ నుంచి బహిష్కరణకు గురైనా తాను  మాత్రం ఆ టీకాను వేసుకునే సవాలే లేదంటున్నాడు టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్. 

వింబూల్డన్ ట్రోఫీని వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఊపులో ఉన్న సెర్బియా టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ వేసుకునే ప్రసక్తే లేదంటున్నాడు. నిషేధాలు విధించినా సరే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా నొవాక్ వ్యవహరిస్తున్నాడు. 

ఆదివారం వింబూల్డన్ లో గెలిచిన అనంతరం అతడు మాట్లాడుతూ.. తాను కరోనా వేసుకోలేదని,  భవిష్యత్ లో వేసుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోకున్నా యూఎస్ ఓపెన్ ఆడతానని  ఆశాభావం వ్యక్తం చేశాడు. 


వింబూల్డన్ ఫైనల్లో కిరియోస్ (ఆస్ట్రేలియా)ను ఓడించిన తర్వాత జొకోవిచ్ మాట్లాడుతూ.. ‘నేను వ్యాక్సిన్ వేసుకోలేదు. సమీప భవిష్యత్ లో కూడా వేసుకునే ఆలోచన లేదు. అయితే యూఎస్ ఓపెన్ లో మాత్రం ఆడతానని అనుకుంటున్నా.  వాళ్లు (అమెరికా) నిబంధనలను సవరిస్తారని ఆశిస్తున్నా..’ అని అన్నాడు. 

‘వాళ్లు మినహాయింపులు ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. కానీ ట్రోఫీ ప్రారంభ సమయానికి వాళ్లు నాకు యూఎస్ ఓపెన్ ఆడే అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నా..’ అని తెలిపాడు. 

వచ్చే నెలలో ప్రారంభం కాబోయే  యూఎస్ ఓపెన్-2022 లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఆటగాళ్లనే  ఈ టోర్నీ ఆడనిస్తామని మిగిలిన వాళ్లకు టోర్నీలో ఆడే అవకాశం లేదని గతంలో నిర్వాహకులు తెలిపారు. ఇది జొకోవిచ్ కు ఇబ్బందికర పరిస్థితే. 
 

ఈ ఏడాది ప్రారంభంలో కూడా  అతడు కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో ఆస్ట్రేలియా ఓపెన్ కు కూడా దూరమయ్యాడు. ఆస్ట్రేలియా కు వెళ్లి అక్కడి ప్రభుత్వం అనుమతించకపోవడంతో అతడు స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఇదే విషయమై నొవాక్ మాట్లాడుతూ.. తనను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తొలగించాక చాలా నిరాశకు గురయ్యానని చెప్పాడు. 
 

‘అది నా మీద చాలా ప్రభావం చూపెట్టింది.  ఆస్ట్రేలియా నుంచి వచ్చాక కొన్ని రోజులు  చాలా నిరాశపడ్డా. మానసికంగా, శారీరకంగా చాలా డిస్ట్రబ్డ్ అయ్యా. ఆ క్రమంలో నేను టెన్నిస్ బాగా ఆడాలని నిశ్చయించుకున్నా. 

కానీ దుబాయ్ లో నేను కోర్టులోకి దిగగానే చాలా ఒత్తిడి తో పాటు ఎమోషనల్ గా వీక్ అయిపోయా. కోర్టులో నేను నా ఆటను ఆడలేకపోయా. కానీ ప్రయత్నించి.. మళ్లీ కఠోర సాధన చేసి ఇక్కడకు (వింబూల్డన్ ఫైనల్) వచ్చా..’ అని తెలిపాడు. 

Latest Videos

click me!