US Open 2022: మాకేం అభ్యంతరం లేదు.. కానీ మా దేశం ఒప్పుకోవాలి : జకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో చుక్కెదురు!

First Published | Jul 21, 2022, 6:52 PM IST

Novak Djokovic: కరోనా వ్యాక్సిన్ వేసుకోనంటే వేసుకోనని మొండిపట్టు పట్టుకుని కూర్చున్న ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు  యూఎస్ ఓపెన్ షాక్ ఇవ్వనుంది. 
 

Image Credit: Getty Images

ఇటీవలే వింబూల్డన్-2022 గెలిచి జోరుమీదున్న ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకొవిచ్ కు భారీ షాక్ తాకింది. యూఎస్ ఓపెన్ లో ఆడి రఫెల్ నాదల్ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును సమం చేయాలని ఆశిస్తున్న అతడికి యూఎస్ ఓపెన్ నిర్వాహకులు షాకిచ్చారు. 

ఆగస్టు 29 నుంచి జరగాల్సి ఉన్న ఈ మెగా ఈవెంట్ ఈ సీజన్ లో చివరిది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్,  వింబూల్డన్ తర్వాత  జరుగబోయే ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్.  అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా  జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ కు దూరమయ్యాడు.  జనవరిలో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి జొకోవిచ్ కు ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే వ్యాక్సిన్ వేసుకోనిదే టోర్నీలో అనుమతినిచ్చేదే లేదని  ఆస్ట్రేలియా ప్రభుత్వం తెగేసి చెప్పడంతో జొకో వెనుదిరిగక తప్పలేదు. 


ఫ్రెంచ్ ఓపెన్ లో పాల్గొన్నా అక్కడ  విఫలమయ్యాడు. కానీ  తనకు అచ్చొచ్చిన వింబూల్డన్ లో మాత్రం మళ్లీ టైటిల్ నెగ్గి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇక ఈ సీజన్ లో జరగాల్సి ఉన్న ఆఖరి టోర్నీ లో జొకోవిచ్  పాల్గొంటాడా..? లేదా..? అనేదానిమీద కొద్దిరోజులుగా చర్చ సాగుతున్నది. 

Image credit: Getty

అయితే టోర్నీ అర్హత లిస్ట్ లో జొకోవిచ్ పేరు ఉన్నా అతడు యూఎస్ ఓపెన్ ఆడేది అనుమానమే. యూఎస్ ఓపెన్ గురువారం విడుదల చేసిన  ఓ ప్రకటనలో. ‘యూఎస్ ఓపెన్ లో  వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతిస్తాం అన్న ఆదేశాలు లేవు. కానీ మా ప్రభుత్వ విధానం ప్రకారం మేం నడుచుకుంటాం.

వ్యాక్సిన్ వేసుకోని వారికి దేశంలో (యూఎస్ పౌరులు  మినహాయించి) ప్రయాణం చేయడానికి ఆస్కారం లేదని ఆదేశాలను మేం గౌరవిస్తాం..’ అని మెలికపెట్టింది. దీంతో జొకోవిచ్ యూఎస్ ఓపెన్ లో ఆడటానికి అవకాశమున్నా అతడి మొండి పట్టుదల వల్ల ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకునే ప్రమాదం పొంచి ఉంది. జొకోకు యూఎస్ ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక మినహాయింపునిస్తే తప్ప అతడు యూఎస్ ఓపెన్-2022లో ఆడటం కలే కానుంది. 

Rafael Nadal-Novak Djokovic

వింబూల్డన్ ట్రోఫీ నెగ్గడం ద్వారా జొకో.. 21 గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన వాడిగా రికార్డులకెక్కాడు. మరో గ్రాండ్ స్లామ్ నెగ్గితే అతడు స్పెయిన్ బుల్  రఫెల్ నాదల్ అత్యధిక గ్రాండ్ స్లామ్ (22)  ల రికార్డును సమం చేస్తాడు. దానికి యూఎస్ ఓపెన్ చక్కని అవకాశం. మరి జొకోవిచ్ నాదల్ రికార్డును సమం చేయాలంటే యూఎస్ ప్రభుత్వం కరుణించడం తప్ప మరో అవకాశమైతే లేదు. 

Latest Videos

click me!