ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు, స్విస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ గత కొన్నాళ్లుగా పెద్దగా టోర్నీలు ఆడటం లేదు. గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు గత రెండు, మూడేండ్లలో ఆటకు దూరంగా.. దగ్గరగా అన్న మాదిరిగానే వ్యవహరిస్తున్నాడు.
గతేడాది ఫెదరర్ మొత్తంగా ఆడింది ఐదు టోర్నీలే.. జకోవిచ్ ప్రభంజనం కొనసాగుతున్న వేళ ఫెదరర్ కూడా మెల్లగా రిటైర్మెంట్ కు దగ్గరపడ్డాడు. మేజర్ టోర్నీల సంగతి అటుంచితే చిన్న చిన్న టోర్నీలలో కూడా అతడు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే నలభైలలో ఉన్న ఫెదరర్ కెరీర్ దాదాపు ముగిసినట్టే.. గతంలో మాదిరిగా ఫెదరర్ ఆటలో దూకుడు లేదు.
గడిచిన రెండేండ్లుగా ఫెదరర్ పెద్దగా టోర్నీలు ఆడకున్నా.. గతేడాది ఐదు టోర్నీలే ఆడినా సంపాదనలో మాత్రం ఈ స్విస్ దిగ్గజం ఇప్పటికీ కింగే అని నిరూపిస్తున్నాడు. టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాళ్లలో ఇప్పటికీ ఫెదరరే అగ్రస్థానంలో ఉన్నాడు.
తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. 2021లో ఫెదరర్ సంపాదన 62.4 మిలియన్ల పౌండ్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 628 కోట్లు. టెన్నిస్ ఆడినా ఆడకున్నా కమర్షియల్ వరల్డ్ లో అతడు ఇప్పటికీ కింగే..
ఫెదరర్ తర్వాత రెండో స్థానంలో మహిళల టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకి (జపాన్) నిలిచింది. గతేడాది ఆమె సంపాదన 41 మిలియన్ పౌండ్లు (రూ. 412 కోట్లు) గా ఉంది. ఒసాకా సంపాదనలో 90 శాతం ఆమె ఎండార్స్మెంట్ల ద్వారానే ఉంది.
ఒసాకా తర్వాత అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ మూడో స్థానంలో నిలిచింది. 2021 లో సెరెనా సంపాదన 24.8 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 240 కోట్లు).
ఆశ్చర్యకరంగా ప్రపంచపు టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్.. నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. ఫెదరర్ తో పోలిస్తే జొకోవిచ్.. ప్రతి టోర్నీలో పాల్గొంటున్నాడు. ఇటీవలే అతడు ఆస్ట్రేలియా ఓపెన్ పాల్గొనాలని చూసినా కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వపు కరోనా ఆంక్షల కారణంగా అవమానకర రీతిలో దాన్నుంచి వైదొలిగాడు. ఇక 2021లో జొకో సంపాదన రూ. 240 కోట్లు.
Nadal
ఇక మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ సంపాదన రూ. 190 కోట్లుగా ఉంది. ఫెదరర్ మాదిరిగానే నాదల్ కూడా గత రెండేండ్లుగా గాయాలతో సతమతమవుతున్నాడు.
ఈ జాబితాలో గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచిన డానియల్ మెద్వదేవ్.. ఏడో స్థానంలో ఉన్నాడు. అతడి సంపాదన సుమారు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక యూఎస్ ఓపెన్ ఛాంపియన్ (మహిళల) గెలిచిన యువ సంచలనం ఎమ్మా రడుకను సంపాదన రూ. 25 కోట్ల పైమాటే. టాప్-10 జాబితాలో ఆమె లేకున్నా 19 ఏండ్ల వయసులోనే ఈ అమ్మడు యూఎస్ ఓపెన్ ఛాంప్ గా అవతరించి భవిష్యత్ తారగా వెలుగొండుతుండటం గమనార్హం.