ఆష్లే బార్టీ మనుసు మార్చుకుందా..? రీఎంట్రీపై మాజీ ఛాంపియన్ కామెంట్స్

First Published | Nov 7, 2022, 3:43 PM IST

Ashleigh Barty: టెన్నిస్ ప్రపంచానికి ఊహించని షాకిస్తూ ఈ ఏడాది మార్చిలో రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ  వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టనుందా..? 

మహిళల టెన్నిస్ లో సుదీర్ఘ కాలం పాటు  నెంబర్ వన్ గా ఉన్న ఆష్లే బార్టీ తిరిగి  రాకెట్ పట్టనుందా..?   ఈ మాజీ ఛాంపియన్ మళ్లీ  టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టనుందా..?  అనే విషయాలపై  కొంతకాలంగా  టెన్నిస్ వర్గాల్లో  జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో స్వయంగా ఆమె స్పందించింది. 

రిటైర్మెంట్ తర్వాత ఆమె ఇటీవల టెన్నిస్ ఈవెంట్లలో మెరుస్తున్నది. ఇటీవలే మెల్బోర్న్ వేదికగా ముగిసిన ఓ మ్యాచ్ లో ఆమె కనిపించింది. ఓ ప్రమోషన్ సందర్భంగా బార్టీ అక్కడ ఉండటంతో అభిమానులు,  మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టు ముట్టారు.   మీరు మళ్లీ టెన్నిస్ లోకి రీఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయన్న దానిపై ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. 


అయితే ఈ 26 ఏండ్ల  మాజీ ఛాంపియన్ మాత్రం తనదైన శైలిలో  సమాధానమిచ్చింది. ‘ఎప్పటికీ రాను.. నేను ఆడాలనుకున్న ఆట ఆడేశాను.. అసలు మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు. లేదంటే లేదు అంతే..’ అని చెప్పింది. అంతేగాక ‘అసలు ఆ  ఆలోచనే విచిత్రంగా ఉంది. నేను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం జరుగదు. కొంతకాలంగా  నెవర్ అనే పదం నా ఫేవరేట్ వర్డ్ గా మారింది..’ అంటూ ఛలోక్తులు విసిరింది.  ఇదిలాఉండగా ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన తర్వాత  ఆమె సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  

ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న తర్వాత కొద్దిరోజులకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇలాంటి కఠిన నిర్ణయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. టెన్నిస్ కు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నా. అయితే  ఆట నుంచి రిటైర్ అవుతున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగానే ఉన్నా.  అంతేగాక దేనికైనా  సిద్ధమే. ఆట కోసం నా వంతు కృషి చేశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 

నా వరకైతే కెరీర్ ను విజయవంతంగానే ముగించానని అనుకుంటున్నాను.  ఈ సందర్భంగా నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.  రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నా...’ అని తెలిపింది.

కాగా..  ప్రపంచ టెన్నిస్ చరిత్రలో  అత్యధిక కాలం (మహిళల విభాగంలో) నెంబర్ వన్ గా ఉన్న నాలుగో క్రీడాకారిణి గా  బార్టీ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 121 వారాలుగా టెన్నిస్ లో ఆమె నెంబర్ వన్ గా ఉంది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవ్రతిలోవా (156 వారాలు) లు బార్టీ కంటే ముందున్నారు. 

Latest Videos

click me!