సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చిన డోసు సరిపోలేదేమో.. ‘కరోనా వ్యాక్సిన్ వేసుకో..’ అని ఎంత మంది చెబుతున్నా అతడు మాత్రం తన మొండి వైఖరిని వీడటం లేదు.
ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ లో వ్యాక్సిన్ వేసుకోకపోవడం, కరోనా నిబంధనలను పాటించకపోవడంతో అతడు కీలక టోర్నీ నుంచి దూరమవడంతో పాటు తీవ్ర విమర్శల పాలైనా అతడు మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
వ్యాక్సిన్ వేసుకోని కారణంగా అతడు ఇప్పుడు మరో రెండు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్లలో భాగంగా.. అమెరికా వేదికగా ఈ మాసాంతంలో మొదలుకాబోయే ఇండియన్ వెల్స్, మియామి టోర్నీల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే అతడు పురుషుల టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే.
అమెరికా లోని సెంట్రల్ ఫర్ డిసీస్ కంట్రోల్ (సీడీసీ) నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులను వారి దేశంలోకి అనుమతించబోమని ఆ దేశం ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జొకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్ మాదిరిగానే ఈ రెండు టోర్నీల నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ వేదికగా తెలపడం గమనార్హం.
జొకో ఇప్పుడున్న ఫామ్ ను బట్టి చూస్తే ఈ రెండు టోర్నీలలో ఆడబోయే ప్రత్యర్థులు, సాధించబోయే విజయాలు పెద్ద విషయమే కాదు. కానీ వ్యాక్సినేషన్ కు దూరంగా ఉండటంతో అతడు వరుసగా టైటిళ్లకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ లతో రఫెల్ నాదల్ (21) తర్వాత స్థానంలో నిలిచిన జొకో.. అతడి రికార్డును అధిగమించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని తెలిసినా అతడు మాత్రం బెట్టు వీడటం లేదు.
ఇది ఇలాగే కొనసాగితే జూన్ నుంచి పారిస్ వేదికగా జరుగబోయే ఫ్రెంచ్ ఓపెన్ కు కూడా జొకోవిచ్ ఆడేది అనుమానమే. ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన అనంతరం పారిస్ కూడా ఆసీస్ తరహా ఆంక్షలనే విధించింది. తమ దేశానికి క్రీడల నిమిత్తం వచ్చే ఆటగాళ్లంతా తప్పకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది.