తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు మాసాల్లో మాంసం వినియోగం భారీగా పెరిగింది. మటన్ విక్రయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది. గతంలో ఎప్పుడూ ఇలా లేదని అధికారులు చెబుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాంసం విక్రయాలు పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం తిన్న మటన్ ను కేవలం ఈ ఆరు మాసాల్లోనే తిన్నట్టుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రజలు ఎక్కువగా మాంసాన్ని కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. మాంసం తినడం ద్వారా మనిషిలో ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నందున ... మాంసం విక్రయాలు పెరగడానికి దోహదపడినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
చికెన్ తింటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో మటన్ వైపుకే వినియోగదారులు మొగ్గు చూపారు. చికెన్ తింటే కరోనా వ్యాప్తి చెందదని వైద్యులతో పాటు ప్రముఖులు ప్రచారం చేయడంతో చికెన్ విక్రయాలు., గుడ్డు విక్రయాలు కూడ ఇటీవల కాలంలో పెరిగాయి. చికెన్, గుడ్లకు డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు కూడ విపరీతంగా పెరిగాయి.
గత ఆరుమాసాల్లో తెలంగాణ రాష్ట్రంలో 6.14 లక్షల టన్నుల మటన్ విక్రయాలు జరిగినట్టుగా జాతీయ మాంసం పరిశోధన సంస్థ రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మాసం వరకు 6.14 లక్షల టన్నుల మటన్ విక్రయాలు జరిగాయని ఆ నివేదిక తేల్చింది.
ప్రతి రోజూ 60 వేల మేకలు, గొర్రెలను మాంసం కోసం కోస్తున్నారని ఈ నివేదిక చెబుతుంది. ప్రతి రోజూ కోసే మేకలు, గొర్రెలలో 25 శాతం హైద్రాబాద్ లోనే విక్రయం సాగుతోంది. రాష్ట్రంలో సుమారు 90 శాతం మంది మాంసాహారులేనని నివేదికలు చెబుతున్నాయి.