తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా జూలై 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. దాదాపు 11.50 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో 6 వేల కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు.
తెలంగాణ రైతు రుణమాఫీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఇప్పటికే లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు రెండో విడత ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు మంగళవారం (జూలై 30) నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియ మొదలైంది.
రెండో విడత రుణమాఫీ
ఆగస్టు నెలలోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు కార్యాచరణ కొనసాగుతోంది. లక్షన్నర రూపాయలలోపు ఉన్న రైతుల పంట రుణాన్ని ఈ దఫా మాఫీ చేయనున్నారు. కాగా, రెండో విడతలో జులై 31 కంటే ముందే రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు అవసరమవుతాయి.
రూ.6వేల 93 కోట్లు జమ
ఇప్పటికే తొలి విడత రుణమాఫీ ప్రక్రియ తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా పూర్తయింది. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేల 93 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, వచ్చే నెల (ఆగస్టు)లో 2 నుంచి 14వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి వచ్చిన వెంటనే మూడో విడతగా 2 లక్షల రూపాయల లోపు రైతుల రుణాలకు మాఫీ వర్తింపజేస్తారు.
బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు
కాగా, జూలై నెలాఖరుకల్లా రూ. లక్షన్నర లోపు రైతు రుణమాఫీ పూర్తి అవుతుంది. ఆగస్టు 15వ తేదీ నాటికి మొత్తం రెండు లక్షల రూపాయల రుణ బకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించనుంది. ఇది పూర్తయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ విజయవంతంగా అమలు చేసినట్లే..
రూ. 31 వేల కోట్లు వ్యయం
తెలంగాణలో రైతు రుణమాఫీకి మొత్తంగా రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ రుణమాఫీ నిధులను ఇతర ఏ రకమైన అప్పులకు జమ చేయొద్దని బ్యాంకర్లకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ. 2 లక్షల మేర రుణ మాఫీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించింది. కుటుంబాన్ని నిర్థారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగదని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారు.