Telangana MLC Result 2025 : ప్రధాని మోదీ ప్రశంసించే స్థాయిలో విజయం... ఎవరీ అంజిరెడ్డి?

Published : Mar 06, 2025, 07:16 PM ISTUpdated : Mar 06, 2025, 07:25 PM IST

తెలంగాణ బిజెపిలో మరోసారి ఊపు వచ్చింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని మోదీ ప్రశంసించే స్థాయి విజయాన్ని అందుకుంది బిజెపి. ఇంతటి అద్బుత విజయాన్ని అందుకున్ని ఈ అంజిరెడ్డి ఎవరో తెలుసా?  

PREV
13
Telangana MLC Result 2025 : ప్రధాని మోదీ ప్రశంసించే స్థాయిలో విజయం... ఎవరీ అంజిరెడ్డి?
Chinnamile Anji Reddy

Chinnamile Anji Reddy : తెలంగాణలో మరోసారి కమలం వికసించింది, కాషాయ జెండా ఎగిరింది... భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి సత్తాచాటడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో రెండు బిజెపి ఖాతాల్లో పడ్డాయి. దీంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బిజెపిని అభినందించారు. 

తెలంగాణలో ఉమ్మడి మెదక్‌-నిజామాబాద్-కరీంనగర్‌-ఆదిలాబాద్ స్దానానికి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండిట్లోనూ బిజెపి విజయం సాధించింది. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పిఆర్టియూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అంటే అధికార కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో విజయమే లేదన్నమాట.   

గత ఫిబ్రవరి 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్ధానాల్లో ఓట్ల లెక్కింపు తొందరగానే పూర్తయ్యింది... గత మంగళవారమే అంటే మార్చి 4న తుది ఫలితం వెలువడింది. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ స్థానంలో బిజెపి బలపర్చిన అభ్యర్థి మల్క కొమరయ్య, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం PRTU నేత శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 

ఇక మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్లలెక్కింపు సుదీర్ఘంగా సాగింది. దాదాపు నాలుగురోజుల తర్వాత ఫలితం వెలువడింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. ఇలా ఎలిమినేషన్ ప్రక్రియలో ఓట్లలెక్కింపు సాగడంతో చాలా సమయం పట్టింది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిపై బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. 
 

23
Telangana mlc election result 2025

త్రిముఖ పోరులో బిజెపిదే విజయం : 

ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 56 మంది బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో  ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మధ్య సాగింది. బిఎస్పి కూడా బలమైన అభ్యర్థిని పోటీలో నిలపడంతో త్రిముఖ పోరు సాగింది. 

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ఫిబ్రవరి 27న పోలింగ్ పూర్తయ్యేవరకు అభ్యర్థులు, పార్టీల లీడర్లు,క్యాడర్ విస్తృత ప్రచారం చేపట్టారు. బిజెపి తరపున అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి బరిలోకి దిగగా బిఎస్పి ప్రసన్న హరికృష్ణను పోటీలో నిలిపింది. అయితే చివరకు విజయం బిజెపినే వరించింది.

రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 98,637 ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. ఇలా 5,106 ఓట్ల మెజారిటీతో అంజిరెడ్డి విజయం సాధించారు. బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికే పరిమితం అయ్యారు. 
 

33
Medak Nizamabad Adilabad Karimnagar Graduate mlc result 2025

ఎవరీ అంజిరెడ్డి? 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది...  ఉమ్మడి మెదక్‌-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. అలాంటిచోట కాంగ్రెస్ ను ఓడించి బిజెపి సత్తా చాటింది. దీంతో విజయం సాధించిన చిన్నమైల్ అంజిరెడ్డి పేరు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. 

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు కేంద్రంలోని బిజెపి పెద్దలు ఈ విజయంపై స్పందించారు. ''ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి బిజెపిని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను'' అంటూ ప్రధాని ట్వీట్ చేసారు. 

''ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని అఖండ విజయంతో ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. మీ నమ్మకం మరింత కష్టపడి సేవ చేసేందుకు మాకు స్ఫూర్తినిస్తుంది.ఇది రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అలుపెరుగని కృషికి దక్కిన విజయం. తెలంగాణా భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డిగారితో పాటు పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేసినందుకు హృదయపూర్వక అభినందనలు'' అంటూ హోమంత్రి అమిత్ షా ట్వీట్ చేసారు.  

ఇలా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు స్పందించడంతో గెలిచిన అభ్యర్థుల గురించి తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత చిన్నమైల్ అంజిరెడ్డి గురించి తెలుసుకుందాం. 

చిన్నమైల్ అంజిరెడ్డి స్వస్థలం హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం.  అతడు 1966 సంవత్సరంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుండి హిందుత్వ భావజాలాలు కలిగిన ఆయన 1978 ఆర్ఎస్ఎస్ చేరారు. ఆ తర్వాత బిజెపి విద్యార్థి విభాగం ఏబివిపిలో పనిచేసారు. 

డిగ్రీ పూర్తిచేసిన తర్వాత అంజిరెడ్డి వ్యాపారం వైపు మళ్లారు... ఎస్సార్ ఇండస్ట్రీస్ స్థాపించారు. అలాగే ఎస్సార్ పేరిట ఓ ట్రస్టును స్థాపించి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఇలా వ్యాపారం, సేవా కార్యక్రమాలు చేపడుతూ 2009  లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2024 లో పటాన్ చెరు అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు.

అయితే ఈ ఓటమి అంజిరెడ్డికి నిరాశ కలిగించలేదు మరింత పట్టుదలను పెంచింది. ఓటమి తర్వాత మరిత యాక్టివ్ గా రాజకీయాల్లో కొనసాగారు. ఆయన భార్య గోదావరి అంజిరెడ్డి కూడా భర్తతో కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించింది. ఈ  క్రమంలో ఆయన సతీమణికి సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్ష పదవి దక్కింది. ఇప్పుడు అంజిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టకపోయినా ఎమ్మెల్సీగా అడుగు పెడుతున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories