తెలంగాణ కాంగ్రెస్ వ్యూహమిదేనా?
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా బిసిలదే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఈ విషయం స్పష్టంగా బైటపడింది. ఇక ఎస్సి, ఎస్టిల జనాభా కూడా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అయితే ఈ వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రతిపక్ష బిజెపి గట్టిగానే ప్రయత్నిస్తోంది. బిసి సీఎం నినాదం, ఎస్సీ రిజర్వేషన్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు అందులో భాగమే. కేంద్ర ప్రభుత్వ సాయంతో బిజెపి బిసి, బలహీనవర్గాలను ఆకర్షిస్తోంది.
బిజెపి ప్రయత్నాలు పలించి బిసి, ఎస్సి, ఎస్టీలు కాషాయం వైపు మళ్లితే కాంగ్రెస్ కు కష్టాలు తప్పవు. అందువల్లే కాంగ్రెస్ కూడా ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగమే తెలంగాణ పిసిసి చీఫ్ గా బిసి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడమైనా, కులగణన చేపట్టి బిసి రిజర్వేషన్లు పెంచే చర్యలయినా, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అయినా.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటోంది... ఇది కేవలం రెడ్డిల పార్టీ కాదు అందరి పార్టీ అని. ఇలా సామాజిక న్యాయం ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. త్వరలో స్థానికసంస్థలు జరగనున్న నేపథ్యంలో భారీ ఓటుబ్యాంక్ కలిగిన బిసి,ఎస్సి, ఎస్టీ సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అనే భావనను తొలగించే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల కాలంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను బట్టి ఓ విషయం మాత్రం స్ఫష్టంగా అర్థమవుతోంది... త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడా బిసిలు, అణగారిన వర్గాలకు ప్రాధాన్యత దక్కుతుందని. ఇది మంత్రిపదవి ఆశించే బడా ఓసి నేతలకు మింగుడుపడని విషయమే.