
యాప (వేప) చెట్టు... భారతదేశ ఔషదవృక్షం అంటారు. వేప ఆకులు, కాయలతో సహా ప్రతిఒక్కటి ఔషదగుణాన్ని కలిగివుంటుంది కాబట్టే ఆ చెట్టును దేవతా ప్రతిరూపంగా కొలుస్తాం. ఇక ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆషాడ మాస బోనాల్లో యాప కొమ్మలు చాలా ప్రత్యేకం. కొన్నిచోట్ల వేప చెట్టును అమ్మవారికి ప్రతిరూపంగా పూజ చేస్తుంటారు. ఇలా పూజలందుకున్న ఓ యాపచెట్టును తన కెమెరాలో బంధించాడు ప్రముఖ ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు. ఇలా దైవంగా భావించి పూజించిన చెట్టుకు సంబంధించిన ఫోటోలతో సామాన్యశాస్త్రం గ్యాలరీ ప్రదర్శనఏప్రిల్ 2న ప్రారంభమై మంచి ఆదరణ పొందింది. ఈ ప్రదర్శన వచ్చే నెల ఆగస్టు ఒకటితో ముగియనుంది.
యాప చెట్టు...Her presence: ఇది ఏక చెట్టు ప్రదర్శన. అవును. ఒకే చెట్టును తీసిన ఫోటో ప్రదర్శన ఇది. ‘Her presence’ అనడం ఎందుకంటే ఆ ఒక్క చెట్టు, దాని చుట్టూ ఉన్న ఆవరణని మాత్రమే ప్రదర్శిస్తున్నందుకు.
ప్రదక్షిణ మాదిరి ప్రదర్శన : వేప చెట్టును మనిషి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాడు. ఒక రోజు గులాబీతో మరో రోజు చేమంతితో అలంకరిస్తడు. ఇంకోరోజు బంతిపూవుతో...ఇలా ఒక్కో రోజు ఒక్కో రకమైన పూలు పెడతాడు. మరో రోజు ఊదుబత్తీలు కూడా ముట్టిస్తాడు. ఇలా రకరకాలుగా కొలుస్తాడు. వాటిన్నటినీ ఫోటోల్లో బంధించారు రమేష్ బాబు.
ఒకే చెట్టు... దాన్ని వెలుగు నీడల్లో, ఎండా వానల్లో... దాని చుట్టూ సాగిన జన జీవితాన్ని దాదాపు పదేళ్ళు (2010 – 2022) ఫోటోల్లో బంధించారు రమేష్ బాబు. ఎండకు ఎండి...వానకు తడిసిన చెట్టునూ... దాని చుట్టూ ఉన్న పరిసరాలను... ఆ చెట్టునీడలో స్త్రీలు, పురుషులు, పిల్లాపాపలతో సరదాగా గడిపిన మధుర క్షణాలను ఫోటోల్లో భద్రపరిచారు.
ప్రజల పూజలందుకున్న ఈ యాప చెట్టు ఉన్నది హైదరాబాద్ నగరంలోని పార్సిగుట్ట వీధిలో. అక్కడి ఆ ఒక్క చెట్టును, దాని చుట్టూ పరివ్యాప్తమైన జీవన శైలిని పలు కోణాల్లో చిత్రించారు రమేష్ బాబు. వాటిల్లోంచి ఎంపిక చేసిన అరవైకి పైగా చిత్రాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేసారు. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖా ఈ ప్రదర్శన స్పాన్సర్ చేసింది. ఒక రకంగా యాపచెట్టు చుట్టూ చేసే ప్రదక్షిణ దిరిగా ఈ ప్రదర్శన సాగుతోంది.
ఒక్క చెట్టు చాలు : ప్రపంచమంతా తిరగడం కాదు, ఒక చెట్టు చాలు.... దాన్ని గమనిస్తే ఎంత విస్తారమైన జీవితం అని చెప్పడానికి ఈ సామాన్యశాస్త్రం ప్రదర్శన తెలియజేస్తోంది. అంతేకాదు, ‘ఎల్లమ్మ’గా కొలిచే ఆ వేప చెట్టు ఎంతటి ఆధ్యాత్మిక శక్తో చాటడానికి కూడా ఈ చెట్టు ఉనికిని చాటడం జరిగిందని ఫోటోగ్రాఫర్ రమేష్ బాబు తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే - చెట్టును కొలిచే మానవుడి ఆత్మను, ఆ చెట్టు చుట్టూ బతికే మానవుడి దేహాన్ని ఏక కాలంలో ప్రతీకాత్మకంగా ప్రదర్శించడమే ఈ ప్రదర్శన సారాంశంగా పేర్కొన్నారు. పచ్చటి చెట్టును నరికేసే మనిషికి గుణపాఠంగానూ ఉంటుందని ఈ ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
‘డై బ్యాక్’ తెగులు బారిన : ఇదిలా ఉంటే గత కొంత కాలంగా తెలంగాణలోనూ యాప చెట్టుకు అంతుపట్టని వ్యాధి ఒకటి సోకుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో చెట్లు ముఖ్యంగా వేప చెట్లు చిగుర్ల నుంచి ప్రారంభమై నిలువునా ఎండిపోయిన సంగతి కూడా మనకు తెలుసు. ఇందుకు కారణం డై బ్యాక్ డిసీజ్’ అని కొందరు కాదు ‘టి మస్కిటో బగ్’ వల్ల అని మరికొందరు అంటున్నారు. నిపుణులు చెప్పినప్పటికీ ఇంకా లోతైన అధ్యయనం జరగవలసి ఉంది. ప్రస్తుతం ఆ సమస్య సద్దుమణిగి నట్లు కూడా ఉంది.
ఏదేమైనా ఔషధ గుణాలున్న ఈ చెట్టు కూడా అంతు తెలియని వ్యాధికి గురవడం, ఆ చెట్టు దానంతట అదే మళ్ళీ చిగురించదాన్ని కూడా ఈ ప్రదర్శన గుర్తు చేస్తుంది. అదే విధంగా మానవుడి జీవితాని, అతడి ధొరణిని, ప్రకృతిని సన్నిహితంగా అర్థం చేసుకోవడం కూడా ఈ ప్రదర్శన ఉద్దేశ్యమని రమేష్ బాబు పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి అందరినీ ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఒక పచ్చటి చెట్టు గొప్ప ఆశకు మూలం అన్న భావనతో యాప చెట్టు ప్రదర్శన కొనసాగింది. అటు పర్యావరణం, ఇటు జీవావరణం గురించిన స్పృహ కలిగిస్తుందని... ఒకే ఒక చెట్టుతో అనేక జ్ఞాపకాలు తట్టిలేపవచ్చనే భావనతో ఈ సామాన్యశాస్త్రం ప్రదర్శన ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజున ఈ ఫోటో ప్రదర్శన ప్రారంభమవగా వచ్చే నెల ఆగస్టు ఒకటిన ఇది ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు. ఈ ప్రదర్శన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆర్థిక చేయూతతో, అభయ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటైందన్నారు. కందుకూరి రమేష్ బాబు. వివరాలకు 99480778983 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
ఫోటో గ్యాలరీ వివరాలు:
సామాన్యశాస్త్రం గ్యాలరీ | Celebrating the ordinary since 5 years
చిరునామా : #8-1-284/OU/227, రెండో అంతస్తు, అలంకార్ హోటల్ దగ్గర,
మణికొండ రోడ్, ఒయూ కాలనీ, షేఖ్ పెట్, హైదరాబాద్– 500008. Email:
kandukurirameshbabu@gmail.com
Google Map: https://goo.gl/maps/NJWLjyCHxuHTAhH98
ఉచిత ప్రవేశం | ప్రతి రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు... ఆదివారాలతో సహా