రేవంత్ రెడ్డికి కవల సోదరుడున్నాడని తెలుసా..? తెలంగాణ సీఎం గురించి ఎవరికీ తెలియని 10 విషయాలు

First Published | Nov 8, 2024, 1:53 PM IST

నవంబర్ 8 అంటే ఇవాళ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని 10 విషయాల గురించి తెలుసుకుందాం. 

Revanth Reddy Birthday

Revanth Reddy Birthday : ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిపెరిగాడు... కుటుంబానికి ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేదు... సొంతంగా రాజకీయాల్లోకి దిగాడు. అట్టడుగు స్థాయినుండి రాజకీయాలు ప్రారంభించి ఇప్పుడు అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇలా పల్లటూరు నుండి  రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఆ నాయకుడు ఎవరో కాదు... మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి అంత ఈజీగా రాలేదు... ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు... మరెన్నో అవమానాలు భరించారు...అన్ని అడ్డంకులు దాటుకుని అనుకున్నది సాధించారు. మొదట బిజెపి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆనాటి టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) లో సాధారణ కార్యకర్తగా పనిచేసారు. ఈ స్థాయి నుండి జడ్పిటిసి,ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే,ఎంపీగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన చివరకు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ, వ్యాపార,సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ సీఎంకు తెలంగాణ ప్రజలు కూడా భర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు... కాబట్టి ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 
 

Revanth Reddy Birthday

రేవంత్ గురించి టాప్ 10 ఆసక్తికర విషయాలు :   
 
1.రేవంత్ రెడ్డికి కవల సోదరుడు :

ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా...ప్రస్తుత తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి లో 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించాడు. తల్లిదండ్రులు అనుముల నర్సింహరెడ్డి, రామచంద్రమ్మ. వీరికి మొత్తం 8 మంది సంతానం... ఏడుగురు మగవారు, ఒక్కతే ఆడబిడ్డ. వీరందరిలో చిన్నవాడు రేవంత్ రెడ్డి. 

నర్సింహరెడ్డి-రామచంద్రమ్మ దంపతులకు చివరి సంతానంగా కవలలు జన్మించారు. వారిలో ఒకరు మన సీఎం రేవంత్ రెడ్డి కాగా మరొకరు కొండల్ రెడ్డి. ఈ కవల సోదరులిద్దరూ కలిసి పెరగారు...  ఈ ఇద్దరి రూపురేఖలు ఒకేలా వుంటాయి. ప్రస్తుతం రేవంత్ కవల సోదరుడు హైదరాబాద్ లో వుంటున్నాడు... వ్యాపారాలు చేసుకుంటూనే సోదరుడికి చేదోడు వాదోడుగా వుంటున్నాడు. 
 


Revanth Reddy

2. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి : 
 
విద్యార్థి దశలో రేవంత్ రెడ్డి బిజెపి అనుబంధ సంస్థలో పనిచేసారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబివిపి) నాయకుడిగా వ్యవహరించారు. ఇలా విద్యార్థిగా వున్నపుడే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత సీరియస్ గా రాజకీయాలు చేయడం ప్రారంభించారు. 

3. ఆనాటి టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) లోనూ రేవంత్ ప్రస్థానం : 

విద్యార్థి దశలో ఏబివిపిలో పనిచేసిన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో వచ్చిన కొత్తలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) లో కూడా పనిచేసారు. సాధారణ కార్యకర్తగా ఆయన టిఆర్ఎస్ కండువాలో వున్నఫోటోలు సీఎం అయ్యాక బాగా వైరల్ అయ్యారు. ఇక ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ గతంలో తనవెంట తిరిగేవాడంటూ ఫోటోలు, వీడియోలు చూపించారు. వీటిని బట్టి రేవంత్ బిఆర్ఎస్ లో కొంతకాలం పనిచేసారని అర్థమవుతుంది.

Revanth Reddy

4. రేవంత్ నామినేషన్ తిరస్కరించిన టిడిపి :

బిఆర్ఎస్ తర్వాత 2004 లో తెలుగుదేశం పార్టీలో చేరారు రేవంత్. అందులో కార్యకర్త స్థాయినుండి మండలస్థాయి నాయకుడిగా ఎదిగిన రేవంత్ 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసిగా పోటీకి సిద్దమయ్యారు. కానీ టిడిపి ఆయనకు కాకుండా మరొకరికి అవకాశం ఇచ్చింది... రేవంత్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. అయితే పార్టీ నిర్ణయాన్ని దిక్కరించిన ఆయన వెనక్కి తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో రేవంత్ రాజకీయ జీవితం మారిపోయింది. 

జడ్పిటిసిగా విజయం రేవంత్ కు కొండంత ధైర్యం ఇచ్చింది. దీంతో రెండేళ్ల తర్వాత అంటే 2008 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసారు. అక్కడ కూడా విజయం సాధించారు. ఇలా వరుస విజయాలతో టిడిపి అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డాడు. ఎమ్మెల్సీగా విజయం తర్వాత స్వయంగా చంద్రబాబే పిలిచి రేవంత్ ను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గ టికెట్ దక్కించుకున్న రేవంత్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 


5. రేవంత్ రెడ్డి అరెస్ట్ : 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేవంత్ రెండోసారి కొడంగల్ నుండి పోటీచేసారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ హవాను తట్టుకుని మరీ రేవంత్ విజయం సాధించారు. ఈసారి ఆయన చాలా అగ్రెసివ్ గా అధికార బిఆర్ఎస్ పై పోరాటం చేసారు. దీంతో ఆయనను ఆనాటి కేసీఆర్ సర్కార్ టార్గెట్ చేసింది. 

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ  ఎన్నికల సందర్భంగా టిడిపి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత రేవంత్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తమకు అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్సన్ కు లంచం ఇవ్వజూపారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఏసిబి అధికారులు రేవంంత్ ను అరెస్ట్ చేసారు. దాదాపు రెండు నెలల పాటు ఆయన జైలుజీవితం గడిపారు.
 

6. తెలంగాణ కాంగ్రెస్ లో చేరిక : 

తెలంగాణలో టిడిపి బలం తగ్గడంలో టిఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోడానికి కాంగ్రెస్ లో చేరారు రేవంత్. 2017 అక్టోబర్ లో తన వర్గంతో కలిసి రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

రేవంత్ చేరికతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి ఊపు వచ్చింది. దీంతో పార్టీలో చేరిన ఏడాదికే ఆయనకు ప్రమోషన్ వచ్చింది... 2018 లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది... అందులో రేవంత్ ఒకరు.  ఆ తర్వాత రేవంత్ కు పూర్తిస్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు... ఆయన టిపిసిసి ప్రెసిడెంట్ గా వుండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 

7. క్రీడాకారుడిగా రేవంత్ : 

రేవంత్ రెడ్డి మంచి క్రీడాకారుడు. కాలేజీ రోజుల్లో ఆయన చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ముఖ్యంగా రేవంత్ ఫుట్ బాల్ ఆడేవారు. రాజకీయాల్లోకి వచ్చాక తెలంగాణ హాకీ, ఇండియన్ హాకీ ఫెడరేషన్ లకు అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. 
 

revanth reddy family

8. ఇంటర్మీడియట్ లోనే రేవంత్ ప్రేమాయణం : 

రేవంత్ రెడ్డి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య ప్రేమ ఇంటర్మీడియట్ లోనే చిగురించిందట. నాగార్జునసాగర్ లో వీరిద్దరికి మొదటిసారి పరిచయం ఏర్పడింది.... ఇద్దరి ఇష్టాలు కలవడంతో ఇది ప్రేమగా మారింది. మొదట రేవంత్ రెడ్డే గీతకు ప్రపోజ్ చేసాడట. ఇలా ఇద్దరి మధ్య కొంతకాలం ప్రేమాయణం సాగగా 1992 వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ పెళ్లి సాఫీగా జరిగింది. 

9. సీఎం పదవి :  

టిపిసిసి చీఫ్ గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపారు రేవంత్. ఆయన వ్యూహాలు, ముమ్మర ప్రచారం బాగా పనిచేసాయి...దీంతో ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం పెరిగింది. ఇలా పార్టీని బలోపేతం చేసి అనుకున్నది సాధించారు... కేసీఆర్ ను గద్దెదించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. 

అయితే ఇంతచేసినా రేవంత్ కు సీఎం పదవి అంత ఈజీగా రాలేదు. టిపిసిసి అధ్యక్షుడిగా వ్యతిరేకించినట్లే తన సత్తాను నిరూపించుకున్న తర్వాత కూడా కొందరు రేవంత్ కు సీఎం పదవి ఇవ్వకూడదని వ్యతిరేకించారు. కానీ కాంగ్రెస్ అదిష్టానం మాత్రం రేవంత్ పై నమ్మకం వుంచింది... ఆయనకే తెలంగాణ పాలనా పగ్గాలు అప్పగించారు. 

10. రేవంత్ అల్లుడిది ఆంధ్రానే : 

రేవంత్ రెడ్డి, గీత దంపతుల ఒక్కగానొక్క కూతురు నిమిషా రెడ్డి. ఈమెకు 2015 లో సత్యనారాయణ రెడ్డికి ఇచ్చి వివాహం చేసారు. ఇతడి స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం. రెడ్డి ఆండ్ రెడ్డి మోటార్స్ యజమాని వెంకట్ రెడ్డి కుమారుడే సత్యనారాయణ. 
 

Latest Videos

click me!