Operation Akarsh
టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి లను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహ యాజులు స్వామి, రామచంద్ర భారతి, నందకుమార్ లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు.
Operation Akarsh
రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో ఉన్న తన ఫాంహౌస్లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఫామ్ హౌస్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్ తో పాటు ఆరు చోట్ల రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు.
Operation Akarsh
బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారువేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆ పై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతి అదుపులోకి తీసుకున్నారు.
Operation Akarsh
ఈ 3 రోజులు ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 74 సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంటన్నరపాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డ్ అయింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు, టి ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి, అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం మండలంలో శ్రీ మంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకుని తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు.
Operation Akarsh
ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులో దెబ్బ తినబోతోందని హైదరాబాద్ వేదికగా డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆ స్వామీజీలను పిలిపించుకుని మాట్లాడారని, అక్కడే స్క్రిప్టు రాసి.. అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీఎంకు సవాల్ విసురుతున్నా.. మీరు యాదాద్రి వస్తారా? టైం, తేదీ మీరే చెప్పండి. బిజెపి తరఫున ఎవరు కోరుకుంటే వాళ్ళం వస్తాం. ఈ డ్రామా తో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా?’ అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారానికి పూర్తి స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రగతిభవన్ నుంచి నడిచిందని, సీఎం కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ఇందులో సైబరాబాద్ కమిషనర్ నటుడిగా మారారని అన్నారు. గతంలో మంత్రిపై హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడారని అది ఫెయిల్ అవడంతో ఇప్పుడు సరికొత్త నాటకమాడుతున్నారని అన్నారు. కొన్ని సీన్లు ముందే పోలీసులు రికార్డు చేసి పెట్టుకున్నారని వివరించారు.