మార్చ్ లో మిగిలిన 3 వారాలు లాంగ్ వీకెండ్సే :
ఈ నెలలో ఇప్పటికే ఓ వారం గడిచిపోయింది...మిగిలింది ఇంకా మూడువారాలే. అయితే ఈ మూడు వారాలూ లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి... అంటే ప్రతి వారాంతం మూడురోజులు సెలవులు రానున్నాయి. పరీక్షల సమయం కాబట్టి ఈ లాంగ్ వీకెండ్స్ లో టూర్స్ కు వెళ్లడం కుదరదు... కానీ సెలవు రోజుల్లో ఇంటివద్దే ఉండి బాగా చదువుకోవచ్చు. పరీక్షలకు సన్నద్దం అయ్యేందుకే కాదు చదువు ఒత్తిడిని తగ్గించుకుని సరదాగా గడిపేందుకు ఈ లాంగ్ వీకెండ్స్ ఉపయోగపడతాయి.
వచ్చే శుక్రవారం అంటే మార్చి 14న హోలీ పండగ. ఈ రంగుల పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక సెలవు ప్రకటించింది. ఆ తర్వాత శనివారం, ఆదివారం పలు ప్రైవేట్ స్కూళ్లతో పాటు కార్పోరేట్ ఉద్యోగులకు సెలవు. కాబట్టి ఈ మూడ్రోజుల సెలవులో ఓ రోజు పండగ జరుపుకుని మిగతా రెండ్రోజులు సరదాగా గడపవచ్చు.
ఇక తర్వాత సోమవారం నుండి గురువారం (మార్చి 17 నుండి 20) వరకు నాల్రోజులు స్కూళ్లు నడుస్తాయో లేదో మళ్లీ సెలవులు వస్తాయి. మార్చి 21 శుక్రవారం షహదత్ హజత్ అలి (shahadat HZT ALI (R.A)) సందర్భంగా ఆప్షనల్ సెలవు ఇచ్చారు. ఆ తర్వాత శని, ఆదివారం సెలవు. అయితే ఈ లాంగ్ వీకెండ్ ముస్లిం మైనారిటీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉంటుంది.
ఇలా రాబోయే రెండువారాలు వరుస లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఇక ఈ నెల చివర్లో తెలుగు సంవత్సరాది ఉగాది, ముస్లింల పవిత్ర పండగ రంజాన్ వరుసగా వస్తున్నాయి. అలాగే రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కూడా తెలంగాణలో ఐచ్చిక సెలవు ఉంది. దీంతో ఈ నెలాఖరున అయితే వరుసగా ఐదురోజుల సెలవులు వస్తున్నాయి.