
Indiramma Housing Scheme : సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. డబ్బున్నోళ్లు కోట్లాది రూపాయలు నీళ్లలా ఖర్చుచేసి రాజభవంతుల్లాంటి అద్దాలమేడలు కట్టుకుంటారు... అందులో విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. కానీ పేద, మద్యతరగతి ప్రజలకు అలాకాదు... ఓ చిన్న ఇళ్లు కట్టుకోడానికి వారి జీవితాన్ని ధారపోస్తారు. వీరిని ఉద్దేశించే అనుకుంటా 'ఇళ్లు కట్టిచూడు, పెళ్లి చేసిచూడు' అనే సామెత పుట్టివుంటుంది. భార్యాబిడ్డలతో సొంతింట్లో హాయిగా జీవించాలనేది ప్రతి సామాన్యుడి కోరిక. అందుకోసమే కడుకు కట్టుకుని, చెమట చిందించి రూపాయి రూపాయి కూడబెడతాడు. ఆ డబ్బుతో తన చిన్న కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలనే నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ హౌసింగ్ స్కీమ్ ద్వారా అర్హులైన నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు కట్టుకోడానికి రూ.5,00,000 ఆర్థిక సాయం చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ పథకం కోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఇవాళ్టి నుండి ప్రారంభమయ్యింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం మొబైల్ యాప్ :
ఇందిరమ్మ ఇళ్ళ పథకం కోసం ఎదురుచూస్తున్న సామాన్య తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై సరిగ్గా ఏడాది పూర్తయ్యింది...ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించారు. అన్ని అర్హతలు కలిగిన లబ్దిదారులను గుర్తించెందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించారు.
ఇందిరమ్మ ఇండ్ల యాప్ పనితీరును ఇప్పటికే పరిశీలించారు అధికారులు. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ యాప్ ను ఉపయోగించి ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వివరాలను సేకరించారు. ఇలా జిల్లాలో ఇద్దరు అర్హుల చొప్పున నాలుగు జిల్లాల్లో కలిపి ఎనిమిదిమంది నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా లాంచింగ్ చేస్తున్నారు. ఇవాళ(గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సచివాలయంలో ఈ యాప్ ను ఆవిష్కరించారు. రేపటి నుండి అంటే డిసెంబర్ 6 శుక్రవారం నుండి పదిరోజుల పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఎలా పనిచేస్తుంది :
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రయత్నించేవారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని అర్హతలు కలిగినవారిని ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండానే ఈ స్కీమ్ ద్వారా ఇంటి నిర్మాణానికి డబ్బులు పొందవచ్చు. అవినీతికి ఆస్కారం లేకండా పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది.
అధికారులే ఇళ్లవద్దకు వచ్చి దరఖాస్తుదారుల పేర్లు, ఆధార్ నంబర్లతో పాటు ఇతర వివరాలను సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నివాసముండే ఇంటి స్వరూపం, కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకుంటారు.గతంలో ఏదయినా పథకం ద్వారా ఇంటిని పొందారా? ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు కట్టుకోడానికి సొంత స్థలం వుందా? ఇలాంటి 30-35 ప్రశ్నలు యాప్ లో వుంటాయి. వాటన్నింటిని లబ్దిదారుల నుండి సేకరించి యాప్ లో నమోదు చేస్తారు.
ఇలా సేకరించిన వివరాల ఆదారంగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అర్హులో కాదో నిర్ణయింపబడుతుంది. కాబట్టి అధికారులకు సరైన వివరాలు అందించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇలా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద లబ్దిదారులను ఎంపికచేయడంలో ఈ యాప్ చాలా కీలకంగా మారింది.
విడతలవారిగా రూ.5,00,000 ఆర్థిక సాయం :
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా అందరి వివరాలను సేకరించి అందులో ముందుగా ఇళ్లు ఎవరికి అత్యవసరమో నిర్ణయిస్తారు. సొంత స్థలం వుండి అందులో ఇళ్లు కట్టుకోవాలనే నిరుపేదలకు మొదట ఎంపిక చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ద్య కార్మికులు, ఆదివాసీలు,గిరిజనులు, ఆర్థికంగా, సామాజికంగా వెనబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.
మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,5000 ఇళ్లను కేటాయించనున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాన్ని చేపడతారన్నమాట. గ్రామసభల ద్వారా లబ్దిదారుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా ఎంపికచేసిన లబ్దిదారులకు ఇంటి నిర్మాణ దశలను బట్టి 4 విడతల్లో డబ్బులు చెల్లించనున్నారు.
సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే కుటుంబంలోని మహిళలను లబ్దిదారులుగా గుర్తిస్తారు. వారి బ్యాంక్ అకౌంట్ లోనే నాలుగు విడతల్లో రూ.5 లక్షలు పడతాయి. మొదట పునాది దశలో రూ.1,00,000, ఆ తర్వాత గోడలు పెట్టి కిటీకీ దశకు వచ్చాక మరో రూ.1,75,000, స్లాబ్ దశలో మరో రూ.1,25,000 ఇస్తారు. ఆ తర్వాత మిగతా పనుల కోసం మరో రూ.1,00,000 ఇస్తారు. ఇలా నాలుగు విడతల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన రూ.5,00,000 అందిస్తుంది ప్రభుత్వం.
ఇంటి స్థలంకూడా లేని నిరుపేదల పరిస్థితి :
మొదట ఇంటిస్థలం కలిగివుండేవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థిక సాయం చేయనున్నారు. ఆ తర్వాత సొంత స్థలం లేనివారికి ప్రభుత్వమే ఇంటిస్థలాన్ని ఇచ్చి నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా చేయనుంది. ఇలా మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది.
రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య మధ్య తరగతి ప్రజల కోసం భారీ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 300 ఎకరాల్లో ఈ ఇళ్ళ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడ, కామారెడ్డి మార్గాల్లో ఒక్కోచోట 100 ఎకరాల చొప్పున 200 ఎకరాలు, ముంబై హైవే ప్రాంతంలో మరో 100 ఎకరాల్లో ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇలా మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.