earthquake in Telangana
earthquake in Telangana : తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఇవాళ ఉదయం ఉలిక్కిపడ్డాయి. కొందరు ఇంకా నిద్రకూడా లేవకముందే ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లనుండి బయటకు పరుగుతీసారు. ప్రజలు షాక్ లో వుండగానే ఈ భూ ప్రకంపనలు ఆగిపోయాయి. కొద్దిసేపటి తర్వాత గానీ అర్థంకాలేదు ఇది భూకంపమని. దీని తీవ్రత చాలా తక్కువగా వుండటంతో ప్రమాదం తప్పింది.
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ భూమి కంపించింది. ఇవాళ(బుధవారం) ఉదయం 7.27 గంటలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. నగర శివారు ప్రాంతాలైన వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ లో స్వల్ప భూకంపం వచ్చింది. అలాగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో భూమి కంపించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ భూకంపం కనిపించింది. విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు ప్రాంతాల్లో భూకంపం కనిపించింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి కదలడంతో భయంతో వణికిపోయారు.... కానీ భూకంప తీవ్రత తక్కువగా వుండటంతో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు.
telangana earthquake
వరంగల్ జిల్లాలో భూకంప కేంద్రం ... ఎక్కడో తెలుసా?
ఇవాళ ఉదయం సంభవించిన భూకంపం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది. ములులు ప్రాంతంలోని మేడారం భూకంప కేంద్రాన్ని గుర్తించారు హైదరాబాద్ సిఎస్ఐఆర్-ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయ్యింది. ఈ భూకంప కేంద్రం నుండి 225 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రత ఎక్కువగా వుంది.వరంగల్, ములుగు, హన్మకొండ, భూపాలపల్లి ప్రాంతాల్లో 3 నుండి 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మంలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, చర్ల,ఇల్లెందు, చింతకాని ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది.
తాజా భూకంపంతో తెలుగు ప్రజల్లో కొత్త భయం మొదలయ్యింది. ఇంతకాల కేవలం వరదలు మినహా ఇతర ఏ ప్రకృతి విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో కనిపించేవి కావు. కానీ ఇప్పుడు భూకంపాలు మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చింది స్వల్ప భూకంపమే కాబట్టి సరిపోయింది... భవిష్యత్ లో పెద్ద భూకంపాలు వస్తే ఎలా? ఇంతకూ తెలుగు రాష్ట్రాలకు భూకంప ప్రమాదం ఏ స్థాయిలో వుంది? భూకంపం వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి. వీటిని నివృత్తి చేద్దాం.
earthquake
భారతదేశంలో భూకంప ప్రమాదం పొంచివున్న ప్రాంతాలు... తెలుగు రాష్ట్రాల పరిస్థితి :
2021 లో ఆనాటి కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ భూకంపాల గురించి ఆసక్తికరమైన డాటాను బైటపెట్టారు. దేశంలో భూకంపాల ప్రమాదం ఎక్కువగా పొంచివున్న ప్రాంతాలేవి... తక్కువ ప్రమాదం వున్న ప్రాంతాలేవో వెల్లడించారు. భూకంప ప్రమాద తీవ్రతను బట్టి దేశాన్ని నాలుగు జోన్లుగా విభజించినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.
జోన్ 5 :
భూకంపాల ప్రమాదం చాలా ఎక్కువగా వుండే ప్రాంతాలను ఈ జోన్ 5 లో చేర్చారు. అంటే ఈ జోన్ లోని ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి... అవి కూడా చాలా ఎక్కువ తీవ్రతతో వుండి భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 7కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలుంటాయి. దేశంలోని 11 శాతం భూభాగం ఈ జోన్ 5 లో వుందని మంత్రి వెల్లడించారు.
జమ్ము కశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర బిహార్, మధ్య బిహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబర్ దీవులు ఈ జోన్ 5 లో వున్నాయి. అంటే ఈ ప్రాంతాల్లోని ప్రజలు హై రిస్క్ లో వున్నట్లు. ఈ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా వుంటుంది.
earthquake
జోన్ 4 :
ఈ జోన్ 4 లోని ప్రాంతాలకు కూడా భూకంప ప్రమాదం ఎక్కువే. రిక్టర్ స్కేలుపై 6-7 తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం వుంటుంది. అంటే భూకంపనలు ఎక్కువగా వుండి ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా వుంటుంది.
ఈ జోన్ 4లో దేశ రాజధాని డిల్లీ వుంది. అలాగే దక్షిణాదిలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, చండీఘడ్, లద్దాక్, ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ లోని కొంత ప్రాంతం ఈ జోన్ లోకి వస్తాయి.
జోన్ 3 :
ఇది ప్రమాద తీవ్రత తక్కువగా వుండే భూకంపాలు సంభవించే జోన్. అంటే తెలుగు రాష్ట్రాల్లో సంభవించినట్లే స్వల్ప భూకంపాలు వస్తుంటాయి. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతాలను ఈ జోన్ లో చేర్చారు.
దక్షిణాది రాష్ట్రాల్లోని విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై,బెంగళూరు, మంగళూరు, ముంబై, పూణే,నాసిక్ వంటి నగరాలు ఈ జోన్ లో వున్నాయి. అలాగే కోల్ కతా,భువనేశ్వర్, కాశీ, అహ్మదాబాద్, రాజ్ కోట్, లక్నో, కాన్పూర్ వంటి ప్రధాన పట్టణాలు వున్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంప తీవ్రత మధ్యస్థంగా వుంటుంది.
earthquake
జోన్ 2 :
ఇది అతంత్య తక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతాలతో కూడిన జోన్.రిక్టర్ స్కేలుపై కేవలం 2-4 తీవ్రతతో మాత్రమే స్వల్ప భూకంపాలు సంభవించే అవకాశం వుంటుంది. ఇలా అతి తక్కువ భూకంప ప్రమాదం కలిగిన జోన్ లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ వుంది. ఏపీలోని కర్నూల్ కూడా ఈ జోన్ లోనే వుంది. ఇక మైసూరు, తంజావూరు, మధురై, జంషెడ్ పూర్,ఉదయ్ పూర్, రాంచీ,ఔరంగాబాద్, నాగ్ పూర్,భోపాల్, ఝాన్సీ పట్టణాలున్నాయి.
భయం వద్దు... హైదరాబాద్ చాలా సేఫ్ :
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం హైదరాబాద్ లో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. ఇక్కడ అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవించినా అవి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే స్థాయిలో వుండవని చెబుతున్నారు. తాజా భూకంపం కూడా అలాంటిదే... కాబట్టి ప్రజలు భయపడవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కేవలం భూకంపాలే కాదు ప్రకృతి విపత్తుల ప్రమాదం హైదరాబాద్ లో చాలా తక్కువ. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతం ... సముద్ర మట్టానికి చాలా ఎత్తులో వుంటుంది. ఇది కూడా నగరం చాలా సేఫ్ గా వుండటానికి కారణం. ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే అవకాశం లేకపోవడం వల్లే హైదరాబాద్ లో చాలా అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటుచేస్తున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో కార్యకలాపాల నిర్వహణకు మల్టి నేషనల్ కంపనీలు ప్రాముఖ్యత ఇస్తాయి.
earthquake
భూకంపం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
1. భూకంపం సంభవించిన సమయంలో చాలామంది కంగారుగా ఇళ్లలోంచి బయటకు వెళ్లడం చేస్తుంటారు. కానీ బయటకు వెళ్లడం వల్లే ఎక్కువ ప్రమాదం. బయట విద్యుత్ స్తంభాలు కూలి కరెంట్ షాక్, వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు, పెద్దపెద్ద హోర్డింగ్ వంటి భారీ వస్తువులు మీదపడటం ఇలా అనేక రకాల ప్రమాదాలు పొంచివుంటాయి. కాబట్టి భూకంపం వేళ ఇంట్లోనే వుండి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. భూ ప్రకంపనలు గుర్తించగానే మంచి లేదా గట్టి టేబుల్ కిందకు దూరిపోవాలి. ఒకవేళ ఈ భూ ప్రకంపనలతో ఇళ్లు కూలినా శిథిలాల నుండి కాపాడుకోవచ్చు. వేరే పదార్ధాలు కూడా మీద పడకుండా వుంటాయి.
2. భూకంపం వేళ బయట వున్నవారు చుట్టు చెట్లు, భవనాలు లేని మైదానం ప్రాంతానికి చేరుకోవాలి. డ్రైవింగ్ లో వుంటే తమ వాహనాన్ని రోడ్డుపక్కన సురక్షిత ప్రాంతంలో ఆపుకోవాలి. కరెంట్ స్తంభాలు, హోర్డింగ్ లు, తాత్కాలిక నిర్మాణాలకు దూరంగా వుండాలి.
3. అపార్ట్ మెంట్స్, పెద్దపెద్ద భవంతుల్లో వున్నవారు భూకంపాల సమయంలో కంగారుపడి బయటకు రావద్దు. భయటకు వచ్చి లిప్ట్ ఎక్కడం అస్సలు చేయకూడదు. తమ ప్లాట్ లోనే సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలి.
4. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లను బలంగా నిర్మించుకోవాలి. తక్కువ ఖర్చులో అయిపోతుందని నాణ్యత లేకుండా ఇళ్లు కట్టుకుంటే భూకంపాల సమయంలో ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ముఖ్యంగా బలమైన పిల్లర్లతో ఇళ్లు నిర్మించుకోవడం వల్ల భూకంపాల నుండి కాపాడుకోవచ్చు.
5. భూకంపాల సమయంలో పొలాల వద్ద వుండే రైతులు చైట్లకు దూరంగా వుండాలి. మైదాన ప్రాంతంలో వుండటమే సురక్షితం. భూకంపం ఆగిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు అక్కడే వుండాలి. ఎందుకంటే భూమి కంపించడం వల్ల బలహీనపడ్డ చెట్లు ఆ తర్వాత విరిగిపడే ప్రమాదం వుంటుంది.
ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా భూకంపాల నుండి సురక్షితంగా బైటపడవచ్చు. మన తెలుగు రాష్ట్రాలకు భూకంప ప్రమాదం చాలా తక్కువ కాబట్టి ఏపీ, తెలంగాణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.