జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో ఐసీఎంఆర్ కరోనాపై సర్వే నిర్వహించనుంది. నగరంలోని ఐదు కంటైన్మెంట్ జోన్లలో రెండు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు.
నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో సర్వేలైన్స్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఐదు కంటైన్మెంట్ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. సర్వే ద్వారా హైద్రాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులపై ఐసీఎంఆర్ నివేదికను అందించనుంది.హైద్రాబాద్ తో పాటు 14 మెట్రో నగరాల్లో హాట్ స్పాట్‌లలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది.
హైద్రాబాద్ పట్టణంలోని 500 శాంపిల్స్ సేకరించనున్నారు. ప్రతి కుటుంబం నుండి ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి శాంపిల్స్ ను సేకరించనున్నారు. 18 ఏళ్ల వయస్సు పై బడిన వారి నుండి శాంపిల్స్ సేకరిస్తారు.
ప్రతి శాంపిల్ కు ఒక కోడ్ ఇస్తారు. రక్తం నుండి సీరమ్ ను వేరు చేస్తారని ఓ మెడికల్ అధికారి తెలిపారు.సీరమ్ శాంపిల్స్ ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్ క్లోసిస్ చెన్నై ల్యాబ్ కు పంపుతారు.
ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఐసీఎంఆర్ సర్వే పూర్తి చేసింది. వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ఐసీఎంఆర్ నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది.
దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో సర్వే నిర్వహించి 24 వేల శాంపిల్స్‌ను సేకరించారు. నాలుగు కేటగిరీల కింద ఈ సర్వే నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఈ సర్వే జరిపారు.
వైరస్ ట్రాన్స్‌మిషన్ ఏమైనా జరిగిందా..! ఎవరికైనా వైరస్ సోకిన తర్వాత యాంటీ బాడీస్ పెరిగాయా లాంటి అంశాలను పరిశీలిస్తూ ఈ సర్వేను నిర్వహించనున్నారు.