కౌంటింగ్: ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారంటే

First Published 22, May 2019, 10:58 AM IST

దేశంలో ఏడు విడతలుగా సాగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన ఉదయం ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఆయా జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.

తొలుత సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కింపుకు అరగంటకు పైగా ఎక్కువ సమయం పట్టదని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఒకవేళ అరగంటకు పైగా ఎక్కువ సమయం పడితే ఈ ఓట్లను లెక్కిస్తూనే ఉదయం 8: 30 గంటల నుండి ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లలో ఓట్లను లెక్కించనున్నారు.
ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లను బట్టి కౌంటింగ్ కోసం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటే 14 మంది కౌంటింగ్ ఏజంట్లు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని రౌండ్లు అవసరమో నిర్ణయిస్తారు.ఒక్కో రౌండ్‌ లెక్కింపుకు గరిష్ఠంగా 30 నిమిషాలు పడుతుంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 - 15 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఈ నియోజకవర్గంలో 36 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఒక్కో టేబుల్‌కు నియోజకవర్గాల వరుసను బట్టి ఒక్కో కంట్రోల్‌ యూనిట్‌ను కేటాయిస్తారు. మొత్తం 14 టేబుళ్ల మీద ఉన్న కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపు పూర్తైతే ఒక రౌండు పూర్తైనట్టుగా పరిగణిస్తారు. ఆ తర్వాత 15 నుంచి 29 వరకు క్రమసంఖ్యలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల కంట్రోల్‌ యూనిట్లు లెక్కింపు చేపడతారు.
ఈవీఎంల కంట్రోల్ యూనిట్ల లెక్కింపు తుది రౌండ్ పూర్తైన తర్వాతే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలలోని వీవీ ప్యాట్ స్లిప్పులను ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలో 35 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు.
ఆయా పోలింగ్ కేంద్రాలలో వీవీప్యాట్లు ఎంచుకోవాలో లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. ఒక్కో ఈవీఎంలలోని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కింపు కోసం సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది.అయితే ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు కనీసం ఐదు గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా.