
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార ఎన్డిఏ కూటమి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను, ప్రతిపక్ష ఇండి కూటమి తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపాయి. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్డిఏ వర్సెస్ ఇండి కూటమి నుండి తెలుగు వర్సెస్ తమిళ్ గా మారాయి. ఇండి కూటమి అభ్యర్థి ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొంచెం ఇరకాటంలో పడ్డాయనే చెప్పాలి. కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు సైతం తెలుగు వ్యక్తికి మద్దతివ్వాలనే వాదన మొదలయ్యింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లోని అన్నిపార్టీల మద్దతును కోరారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలే కాదు బిఆర్ఎస్, ఎంఐఎం, చివరకు బిజెపి ఎంపీలు సైతం ఇండి కూటమి అభ్యర్థికి ఓటేయాలని సూచించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేనలతో పాటు వైసిపి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఓటేసి తెలుగుజాతి ఐకమత్యాన్ని దేశానికి తెలియజేయాలని సూచించారు. ఇలా తెలుగు సెంటిమెంట్ ను రగిలిస్తూ కేసీఆర్, అక్బరుద్దీన్ ఓవైసి, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం రేవంత్ సంధించిన తెలుగు సెంటిమెంట్ అస్త్రాన్ని బిసి సెంటిమెంట్ అస్త్రంతో తిప్పికొట్టారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వబోమని కేటీఆర్ స్పష్టం చేశారు... ఈ క్రమంలో ఓ బిసి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందని సూచించారు. ఇలా తమను ఇరకాటంలో పెట్టాలనుకున్న రేవంత్ రెడ్డినే ఇరకాటంలో పెట్టారు కేటీఆర్.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్ని తెలుగు అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ సీఎం కోరిన విషయం తెలిసిందే. గతంలో పివి నరసింహారావుకు ప్రధానిగా అవకాశం దక్కిన సమయంలో ఎన్టీఆర్ మద్దతిచ్చినట్లుగానే అన్ని రాజకీయ పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఇలా రేవంత్ తెలుగు సెంటిమెంట్ ను తెరపైకి తీసుకురాగా మాజీ మంత్రి కేటీఆర్ బిసి సెంటిమెంట్ తో దాన్ని తిప్పికొట్టారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత రాష్ట్ర సమితి సర్వ స్వతంత్ర పార్టీ... తమకు డిల్లీ బాసులెవరూ లేరని అన్నారు. తెలంగాణ ప్రజలే బిఆర్ఎస్ కు బాసులు... వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ నిర్ణయాలుంటాయన్నారు. ఇప్పటివరకు తమను ఇండి కూటమిగానీ, ఎన్డిఏ గానీ సంప్రదించలేవని తెలిపారు. బిఆర్ఎస్ ఏ కూటమిలోనూ లేదు కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల తేదీ నాటికి పార్టీ నాయకులందరితో చర్చించి తమ వైఖరిని ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు. .
రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే కచ్చితంగా వ్యతిరేకిస్తాం... ఎందుకంటే కాంగ్రెస్ ఒక చిల్లర, థర్డ్ క్లాస్ పార్టీ అని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థిని మేం ఎలా సపోర్ట్ చేస్తాం? అస్సలు చేయబోమని స్పష్టం చేశారు. ఇలా తెలుగు వ్యక్తి అయినప్పటికీ ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బిఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశమే లేదని కేటీఆర్ మాటలనుబట్టి అర్థమవుతోంది.
బీసీల మీద ప్రేమ కురిపించే కాంగ్రెస్ పార్టీ మరి బీసీ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు? తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థే దొరకలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టాల్సిందని కేటీఆర్ సూచించారు. ఎన్నికలు వచ్చేసరికి బిసిలను మరిచారా? అంటూ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఇలా బిఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతిగా తెలంగాణ బిసికి అవకాశం ఇవ్వాల్సిందనే కొత్తవాదనను తెరపైకి తీసుకువచ్చింది.