
నేను గత రెండు దశాబ్దాలుగా సాంకేతిక ప్రపంచంలో వచ్చిన అనేక మార్పులను, అంచనాలను చాలా దగ్గరి నుంచి చూశాను. 1990 చివర్లో డాట్ కామ్ బబుల్ పగిలిపోయినప్పుడు చూసిన ఆర్థిక సంక్షోభం కంటే.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూ ఏర్పడిన ఆర్థిక బబుల్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ AI బబుల్ అప్పటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ బబుల్ కంటే నాలుగు రెట్లు, డాట్ కామ్ బబుల్ కంటే 17 రెట్లు పెద్దదని స్వతంత్ర విశ్లేషణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవ మనుగడపై ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) ప్రభావం ఎలా ఉండనుందో మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) అనేది ఇప్పటికీ ఒక ఊహాజనిత భావన. అయితే దీని శక్తి అపారం. ASI అనేది మానవ మేధస్సు పనితీరును మించిపోతోంది. ASI అనేది పరిమితులు లేనిది. స్వీయ మెరుగుదల సామర్థ్యం కలిగినది. ప్రస్తుతానికి మనం వాడుతున్న ChatGPT వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) కేవలం ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ (ANI) కేటగిరీకి చెందుతాయి. ఇవి నిర్దిష్ట పనులను మాత్రమే చేయగలవు.
కానీ ASI అలా కాదు.. దీని శక్తి విస్తృతమైనది. ఈ సూపర్ ఇంటెలిజెన్స్ దాని సొంత సోర్స్ కోడ్‌ను సవరించుకోగలదు. దాని మేధస్సును నిరంతరం పెంచుకోగలదు. ఫలితంగా ఇంటెలిజెన్స్ ఎక్స్‌ప్లోషన్ (Intelligence Explosion) ఏర్పడవచ్చు. ఇది మానవ మేధస్సును చాలా వెనుకకు నెట్టివేస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం మానవ స్థాయి మెషీన్ ఇంటెలిజెన్స్ (HLMI) ఆవిష్కరణ జరిగిన 30 ఏళ్లలోపు.. మెషీన్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించబడే అవకాశం 50 శాతం వరకు ఉందని అంచనా.
ఒక జర్నలిస్ట్‌గా సాంకేతికత ద్వారా ప్రపంచానికి వచ్చే ప్రయోజనాలను నేను నమ్ముతాను. కానీ.. ASI విషయంలో ప్రయోజనాలతో పాటు తీవ్రమైన ప్రమాదాల గురించి ప్రపంచ మేధావులు హెచ్చరిస్తున్నారు.
• అస్తిత్వ ముప్పు:
భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు AI మానవ నియంత్రణకు మించి అభివృద్ధి చెందగలదని ఆందోళన వ్యక్తం చేశారు. హాకింగ్ సిద్ధాంతం ప్రకారం.. ఇది మానవ జాతి అంతానికి దారితీయవచ్చు.
• అనియంత్రిత శక్తి:
సూపర్ ఇంటెలిజెంట్ మెషీన్ సరైన నైతిక లక్ష్యాలను కలిగి లేకపోతే.. అది తన అంతిమ లక్ష్యాలను సాధించడానికి శక్తిని.. కేవలం ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణతో చెప్పాలంటే.. పేపర్ క్లిప్‌లను తయారుచేయడానికి మాత్రమే రూపొందించిన ఒక AI, ప్రపంచంలోని అన్ని వనరులను పేపర్ క్లిప్‌ల కోసం ఉపయోగించడానికి ప్రపంచాన్నే స్వాధీనం చేసుకోవాలనుకోవచ్చు.
• సామాజిక, ఆర్థిక ప్రభావం:
ASI.. అనుకోని ప్రపంచ అంతరాయాలకు కూడా దారితీయవచ్చు. ఆర్థిక అసమతుల్యతను సృష్టించవచ్చు. ASI మానవ నియంత్రణకు మించి పనిచేసే అవకాశం ఉంది కాబట్టి.. ఊహించలేని నష్టాలు తీసుకువచ్చే ప్రమాదం కూడా ఉంది.
ASI అనేది భవిష్యత్తు గురించి చర్చ అయితే.. ప్రస్తుత జనరేటివ్ AI (GenAI) ప్రభావం ఇప్పటికే మన ఆఫీసులను మార్చేస్తోంది. ప్రస్తుత AI విప్లవం.. గతంలోని మాన్యువల్ లేదా బ్లూ-కాలర్ ఉద్యోగాలను ప్రభావితం చేసినట్లు కాకుండా... ఇప్పుడు వైట్-కాలర్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుంటోంది. కోడింగ్, టెక్స్ట్ జనరేషన్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి మేధోపరమైన పనులు ఆటోమేషన్ రిస్క్‌కు గురవుతున్నాయి.
భారతదేశంలోని వైట్-కాలర్ ఉద్యోగులలో 68 శాతం మంది తమ ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా ఆటోమేట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే AI మొత్తం ఉద్యోగాలను తొలగించడం లేదు. వాటి స్వభావాన్ని మారుస్తోంది. AI ఎక్కువగా అసిస్టెంట్‌గా, సలహాదారుగా లేదా టీచర్‌గా పనిచేస్తోంది. సమాచారాన్ని సేకరించడానికి, రాయడానికి ఉపయోగపడుతోంది.
2030 నాటికి.. AI 92 మిలియన్ ఉద్యోగాలను తొలగించినప్పటికీ, 170 మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. అంటే 78 మిలియన్ల నికర లాభం ఉంటుందన్న మాట. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి రంగాల్లో AI నైపుణ్యాలు ఉన్న కార్మికుల డిమాండ్ పెరుగుతోంది. వీరు సగటున 56 శాతం అధిక వేతనాన్ని పొందుతున్నారు.
మనం ASI వైపు అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమైన సవాలు సూపర్ అలైన్‌మెంట్ (Superalignment). అంటే.. మానవుల కంటే చాలా తెలివైన AI వ్యవస్థలను మానవ విలువలు, ఉద్దేశాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. ముందుచూపు ఉన్న వ్యవస్థలు.. ఉద్యోగుల అడాప్టబిలిటీపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో స్థిరంగా ఉండే ఉద్యోగాలకు టెక్నికల్ లిటరసి, క్రియేటివ్ ఇన్నోవేషన్, ఎథికల్ జడ్జ్ మెంట్ వంటివి అత్యవసరం.
ASIని కేవలం సాంకేతిక ఆవిష్కరణగా చూడకుండా, మానవజాతి భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా పరిగణించి, దానికి తగిన నైతిక, పాలనాపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించుకోవడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా మనదేశంలో AI నైపుణ్యాల పెరుగుదల పరంగా అగ్రస్థానంలో ఉంది. ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని సాంకేతికతను మానవ శ్రేయస్సు కోసం ఉపయోగించేలా రూపొందించుకోవాలి.