Phone Overheating: స్మార్ట్‌ఫోన్లు వేడెక్కుతున్నాయా.. ఆ సమస్య తగ్గాలంటే ఇలా చేయండి..!

First Published | Apr 18, 2022, 9:34 AM IST

సాధారణంగా ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వారి మొబైల్స్ ఒక్కోసారి బాగా హీటెక్కుతూ (Phone Overheating Issue) ఉంటాయి. ఈ వేడి దెబ్బకి ఒక్కోసారి మొబైల్స్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ హీటెక్కడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా కనిపించే కారణాలతో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించినట్లయితే మన ఫోన్ ని ఓవర్ హీట్ నుండి రక్షించుకోవచ్చు.
 

అదిరిపోయే ఫీచర్లతో రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వేగంవంతమైన ప్రాసెసర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు, రికార్డింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లు హీట్ అవడం చాలా మందికి అనుభవమే. ఒక్కోసారి అది పేలుతుందేమోనని కొందరు భయపడుతుంటారు కూడా. మరి ఫోన్ ఓవర్ హీట్ కాకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?
 

ఫోన్ కింద పడినా డిస్‌ప్లే పగిలిపోకుండా ఉండేందుకు చాలా మంది కవర్ కేస్‌లను వాడుతుంటారు. కానీ ఇవి ఫోన్ నుంచి ఉత్పత్తయ్యే వేడి బయటకు పోకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నప్పుడు కవర్ తీసేయడం వల్ల కొంత వేడి తగ్గుతుంది. చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేప్పుడు దాన్ని బెడ్ మీదో, సోఫా మీదో వదిలేస్తారు. ఛార్జింగ్ పెట్టే సమయంలో సాధారణంగానే వేడి విడుదలవుతుంది. బెడ్, సోఫా లాంటి వాటి మీద ఉంచితే వేడి మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి గట్టిగా ఉండే ఉపరితలం మీద వాటిని ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కడం తగ్గుతుంది.

Latest Videos


చాలా మంది ఫోన్‌ను రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి రాత్రంతా అలా వదిలేస్తారు. అలా చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గడంతోపాటు ఫోన్ వేడెక్కడం కూడా పెరుగుతుంది. ఇలా రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఒక్కోసారి ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని రకాల యాప్స్‌ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా ఫోన్ హీట్ అవుతుంది. ఇవి బ్యాక్‌గ్రౌండ్లో రన్ అవుతూనే ఉండటం వల్ల ఫోన్ వేడెక్కడం అనే సమస్య ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అలాంటి యాప్స్‌ను ఫోన్ నుంచి తీసేయండి.
 

ఫోన్లపై ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉన్న వాటిపై నేరుగా సూర్యరశ్మి పడకుండా జాగ్రత్త పడండి. స్యూర కిరణాల నుంచి వచ్చే వేడి, ఫోన్ ప్రాసెసింగ్ వల్ల ఉత్పత్తయ్యే వేడితో కలవడం వల్ల ఫోన్ మరింత వేడెక్కుతుంది. ఫోన్‌తోపాటు వచ్చిన ఛార్జర్లను, బ్యాటరీలను కాకుండా బయట కొనుగోలు చేసిన వాటి వాడకాన్ని ఆపేయండి. ఛార్జర్లలో ఒక్కోదానికి ఒక్కో వాటేజ్ ఉంటుంది. ఈ కారణంగా కూడా మీ ఫోన్ వేడెక్కే ప్రమాదం ఉంది.

click me!