
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)... అత్యాధునిక టెక్నాలజీలో మరో విప్లవం అనే చెప్పాలి. అదీ ఇదని లేదు ఇప్పుడు అన్ని రంగాల్లో ఈ ఏఐ టెక్నాలజీ వాడకం పెరిగింది... భవిష్యత్ లో ఇది మరింతగా విస్తరించనుంది. ఈ ఏఐ మీడియా రంగంలో కూడా అనేక మార్పులకు కారణమవుతోంది. ఇది డిజిటల్ మీడియా రంగంలో రిపోర్టర్, ఎడిటర్, స్క్రిప్ట్ రైటర్, అనలిస్ట్ గా వ్యవహరిస్తోంది... అయితే ఇందుకోసం ప్రాంప్ట్ చాలా కీలకంగా మారింది.
అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫార్మ్స్ ఉచితంగానే సేవలను అందిస్తున్నాయి. మెరుగైన సేవలకోసం కొన్ని ప్లాట్ ఫార్మ్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే డిజిటల్ మీడియాలో సాధారణ ఏఐ టూల్స్ ని ఉపయోగించి అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఇంతకాలం కేవలం ఏఐ స్క్రిప్ట్, ఫోటోలే వాడేవారు... ఇప్పుడు వీడియోలు కూడా వాడుతున్నారు. ఏఐ కూడా మనుషుల మాదిరిగానే ఉంటుంది... స్పష్టంగా చెబితే స్పష్టంగా పని చేస్తుంది. స్పష్టత + సందర్భం + లక్ష్యంతో కూడిన ప్రాంప్ట్ ఇస్తే కావాల్సిన సమాచారం లభిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం ఏం కావాలనుకుంటున్నామో తెలియజేయాల్సి ఉంటుంది.. అప్పుడే అది మనకు కావాల్సిన సమాచారం గానీ, ఫోటోలు లేదా వీడియోలు గానీ ఇస్తుంది. ఇలా ఏఐకి ఇచ్చే ఆదేశాలనే ప్రాంప్ట్ అంటారు.
మనం ప్రశ్న రూపంలో ప్రాంప్ట్ ఇస్తే ఏఐ జవాబు ఇస్తుంది... సమాచారం కోసం ప్రాప్ట్ ఇస్తే ఎక్కడెక్కడి నుండో సేకరించి ఇచ్చేస్తుంది... ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తే మనం కోరిన విధంగా ఇచ్చేస్తుంది. ఇలా ఏఐని సమర్థంగా ఉపయోగించుకోవాలంటే సరైన ప్రాంప్ట్ ఇవ్వడం చాలాముఖ్యం.
1. ఎవరిలా పనిచేయాలో చెప్పండి
AI అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే... మనిషి కాదు. మనం ఎలా ప్రాంప్ట్ ఇస్తే అలాగే రిజల్ట్ కూడా ఇస్తుంది. కాబట్టి ముందుగా ఎవరిలా పనిచేయాలో ఏఐకి సూచించండి. ఆ తరహాలో ఆలోచించేలా ఆదేశాలివ్వండి.
ఉదాహరణ : “మీరు సీనియర్ జర్నలిస్ట్‌గా వ్యవహరించండి” అని ప్రాంప్ట్ లో పేర్కొనండి. తద్వారా ఏఐ కూడా అలాగే ఆలోచించి అందుకు తగినట్లుగా వ్వహరిస్తుంది.
2. ఏ పని చేయాలో చెప్పండి
ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్ లో ముఖ్యంగా ఏ పని చేయాలో స్పష్టంగా పేర్కొనడం మంచింది. దీంతో మనకు కావాల్సిన సమాచారాన్ని చాలా స్పష్టంగా పొందవచ్చు.
ఉదా : “ఏపీ బడ్జెట్‌పై విశ్లేషణాత్మక న్యూస్ ఫీచర్ రాయండి”
3. ఎలా కావాలి, ఎంత కావాలో చెప్పండి...
సమాచారం ఎలా కావాలి... పాయింట్స్ రూపంలోనా, పారాగ్రాఫ్ రూపంలోనా ప్రాంప్ట్ లో పేర్కొనండి. ఎంత కావాలి అనేది కూడా ప్రాంప్ట్ లో పేర్కొనండి.
ఉదా..: “500 పదాల న్యూస్ ఫీచర్ స్టైల్‌లో” ఇవ్వాలని ప్రాంప్ట్ ఇస్తే అలాగే ఇస్తుంది.
4. టోన్ ఆండ్ లాంగ్వేజ్ చెప్పండి
సందర్భాన్ని బట్టి మనం చెప్పే విషయం ఏ టోన్ లో ఉండాలో నిర్ణయిస్తుంటాం. కాబట్టి ఏఐకి కూడా ఏ టోన్ లో సమాచారం కావాలో సూచించింది. ప్రొఫెషనల్? ఎమోషనల్? టీవీ యాంకర్ స్టైల్? అనేది సూచించండి.
ఉదా..:“ప్రొఫెషనల్ న్యూస్ రూమ్ టోన్‌లో తెలుగులో రాయండి”
5. అదనపు వివరాలు ఇవ్వండి
మనకు కావాల్సిన సమాచారం కోసం వీలైనంత ఎక్కువ స్పష్టతతో ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. డేటా, ఉదాహరణలు, కోట్స్, హెడ్‌లైన్… ఇలా ఏది కావాలో స్పష్టంగా ఏఐకి సూచించారు.
ఉదా : “డేటా, ఉదాహరణలు, నిపుణుల అభిప్రాయాలు జోడించండి”
సాధారణంగా ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్స్ ని మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది బేసిక్ ప్రాంప్ట్... అంటే చాలా సింపుల్ గా సమాచారాన్ని కోరడం అన్నమాట. ఉదాహరణకు ''భవిష్యత్ లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి రాయండి'' అని అడగవచ్చు.
రెండోది మెరుగైన ప్రాంప్ట్... మరింత స్పష్టంగా ప్రాంప్ట్ ఇవ్వండం అన్నమాట. ‘’ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి 400 పదాల ఆర్టికల్ రాయండి'' అనడం మెరుగైన ప్రాంప్ట్ అవుతుంది.
ఇక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంకా స్పష్టంగా ఉంటుంది. ''డిజిటల్ మీడియా రంగంలో ఏఐ కో-వర్కర్స్ ఎదుగుదలపై విశ్లేషణాత్మక న్యూస్ ఫీచర్ రాయండి. తాజా ట్రెండ్స్, నిపుణుల అభిప్రాయాలు, భవిష్యత్ అంచనాలు చేర్చండి. ప్రొఫెషనల్ జర్నలిస్టిక్ టోన్‌లో తెలుగులో ఇవ్వండి'' ఇలా ప్రాంప్ట్ ఇవ్వండం ద్వారా ఏఐ కూడా స్పష్టంగా సమాచారం ఇస్తుంది.
ఏఐని ఉపయోగించడం అంటే కేవలం ప్రశ్నలు అడగడం కాదు… సరైన విధంగా సూచనలు ఇవ్వడం. ఎవరైనా, ఏ పనైనా, ఏ AI అయినా…సరైన ప్రాంప్ట్ ఇస్తే అది ఒక పూర్తి టీమ్‌లా పని చేస్తుంది. రాబోయే రోజుల్లో ఏఐని గెలిచేది టెక్నాలజీ కాదు… సరైన ప్రాంప్ట్ ఇవ్వగలిగిన మనుషులే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.