Mobile Charging Tips: ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు బ్యాటరీని పాడుచేస్తాయి. మొబైల్ ఛాార్జింగ్ విషయంలో గూగుల్, ఆపిల్ హెచ్చరించిన ఈ ముఖ్యమైన అంశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి
మన రోజువారి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. దీంతో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మనకు అలవాటుగా మారింది. అయితే, ఛార్జింగ్ చేసేటప్పుడు మనం తెలియకుండానే కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటాం.
చాలామంది నాణ్యత లేని కేబుల్స్ వాడటం, చౌకగా దొరికే డూప్లికేట్ ఛార్జర్లు కొనడం లేదా ఫోన్ బాగా వేడెక్కినా పట్టించుకోకుండా ఛార్జింగ్‌లోనే ఉంచడం లాంటివి చేస్తుంటారు. వీటి వల్ల ఛార్జింగ్ స్లో అవ్వడమే కాకుండా, ఫోన్ బ్యాటరీ శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆపిల్, గూగుల్ కంపెనీలు కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలను జారీ చేశాయి. ఆ వివరాలు గమనిస్తే..
26
చౌకగా దొరికే డ్యామేజ్డ్ కేబుల్స్ వాడకండి
మీ ఫోన్ పిన్‌కి కేబుల్ కనెక్ట్ అయినంత మాత్రాన అది మంచి కేబుల్ అని అనుకోవద్దు. పాడైపోయిన లేదా లోకల్ కేబుల్స్ వాడటం వల్ల ఛార్జింగ్ సరిగ్గా ఎక్కదు. గూగుల్ సూచన ప్రకారం, ఫోన్‌తో పాటు వచ్చిన లేదా సరైన ప్రమాణాలు కలిగిన కేబుల్స్ మాత్రమే వాడాలి.
కేబుల్ వైర్లు బయటకు కనిపిస్తున్నా, లేదా కనెక్టర్ పాడైపోయినా దాన్ని వెంటనే మార్చేయాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్లకు నాణ్యత లేని కేబుల్స్ వాడితే బ్యాటరీ దెబ్బతింటుంది.
36
ఫోన్ బాగా వేడెక్కితే ఛార్జింగ్ వెంటనే ఆపేయండి
ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ కొద్దిగా వేడెక్కడం సాధారణమే. కానీ పరిమితికి మించి వేడెక్కితే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. తీవ్రమైన వేడి వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని, దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుందని ఆపిల్ స్పష్టం చేసింది. ఫోన్ బాగా హీట్ అవుతున్నట్లు అనిపిస్తే, ఛార్జింగ్ నిలిపివేసి ఫోన్‌ను చల్లటి ప్రదేశంలో ఉంచాలి.
దిండు లేదా బెడ్‌షీట్ కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేయొద్దు
ఈ తప్పు చాలామంది చేస్తుంటారు. ఛార్జింగ్ సమయంలో ఫోన్, ఛార్జర్ నుండి వేడి బయటకు వస్తుంది. ఫోన్‌ను దిండు, గాలి తగలని బెడ్‌షీట్ లేదా మరేదైనా కింద ఉంచితే ఆ వేడి బయటకు వెళ్లలేక లోపలే ఉండిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఛార్జింగ్ పెట్టేటప్పుడు గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలని ఆపిల్, గూగుల్ సలహా ఇస్తున్నాయి.
56
ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉంటే ఛార్జ్ చేయకండి
ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో నీరు లేదా తేమ ఉంటే ఛార్జర్ పిన్ అస్సలు పెట్టకూడదు. ఒకవేళ పోర్ట్ తడిగా ఉంటే ఛార్జర్ తొలగించి, ఫోన్‌ను పూర్తిగా ఆరనివ్వాలని గూగుల్, ఆపిల్ పేర్కొన్నాయి. తడిగా ఉన్న ఫోన్‌ను త్వరగా ఆర్పడానికి హెయిర్ డ్రైయర్లు లేదా వేడి గాలి ఇచ్చే సాధనాలను వాడకూడదని కూడా గూగుల్ హెచ్చరించింది.
66
లూజ్ ఛార్జింగ్ పోర్ట్, డైరెక్ట్ ఎండ వద్దు
ఛార్జింగ్ పెట్టినప్పుడు కేబుల్ పదే పదే ఊడిపోతున్నా లేదా కొద్దిగా కదిలించినా ఛార్జింగ్ ఆగిపోతున్నా దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. పోర్ట్‌లో ధూళి చేరడం వల్ల కూడా ఇలా జరగొచ్చు. అయితే పోర్ట్‌లో పిన్నులు లేదా పదునైన వస్తువులు పెట్టి శుభ్రం చేయడానికి ప్రయత్నించవద్దు. పోర్ట్ కాలినట్లు లేదా పాడైనట్లు కనిపిస్తే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడమే మంచిది.
అలాగే, కారు డాష్ బోర్డ్ మీద, కిటికీల దగ్గర ఎండ నేరుగా పడే చోట లేదా వేడిగా ఉండే గదుల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టకూడదు. అధిక వేడి బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఇక రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ వెంటనే పాడైపోదని, ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జింగ్ కట్ అయ్యే ఆటోమేటిక్ ఫీచర్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే, గాలి తగలకుండా వేడెక్కే ప్రదేశాల్లో రాత్రంతా ఛార్జింగ్ ఉంచడం మాత్రం మంచిది కాదు.