Deepseek AI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)... మరో సాంకేతిక విప్లవానికి తెర తీసింది. ఈ ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జిపిటి ఎంతలా సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన వంటివి కూడా ఈ ఆర్టిఫిషియల్ లోకి ప్రవేశించాయి. ఇలా అమెరికన్ కంపనీలు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఇలా ఏఐ విషయంలో ఇక తమకు తిరుగులేదని అగ్రరాజ్యం భావిస్తున్న సమయంలో చైనా ఎంట్రీ ఇచ్చింది. అత్యంత చౌక ధరలకే అత్యాధునిక టెక్నాలజీని అందించే చైనా కంపనీలు ఇప్పుడు ఏఐపై దృష్టి పెట్టాయి. ఇలా ఏఐ విషయంలో అమెరికా సంస్థలకు షాక్ ఇస్తూ చైనీస్ కంపనీ 'డీప్ సీక్' ఎంట్రీ ఇచ్చింది. ఇది మంచి ప్రజాధరణ పొందుతుండటంతో దిగ్గజ కంపనీలు కుదేలవుతున్నాయి.
కేవలం ఏడాది ఏడాదిన్నర వయసు కూడా లేని డీప్ సీక్ స్టార్టప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దూసుకుపోతోంది. దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో వున్న దిగ్గజ కంపనీలను సైతం వెనక్కి నెడుతోంది. ఈ చైనీస్ సంస్థ దాటికి అమెరికన్ టెక్ సంస్థల పరపతి పడిపోతోంది... వీటి స్టాక్స్ భారీగా పతనం అవుతున్నాయి.