ZIM vs AUS : కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో కంగారూల పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా ఓటమికి 5 కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆసీస్ కొంపముంచిన జింబాబ్వే.. వరల్డ్ కప్‌లో పెను సంచలనం!
కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ బీ మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. పసికూన జింబాబ్వే గెలుపు దాహంతో ఊగిపోతూ బలమైన ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో గ్రూప్-బీ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ (4/17) తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ వెన్నెముకను విరిచాడు. ఈ మ్యాచ్ లో కంగారులు ఓడిపోవడానికి కారణాలు గమనిస్తే..
26
నిలకడగా ఆడిన జింబాబ్వే బ్యాటర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుండే ఆచితూచి ఆడింది. ఓపెనర్లు బ్రైన్ బెన్నెట్, తడివనాశే మరుమని అద్భుతమైన పునాది వేశారు. మరుమని 21 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసి మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ర్యాన్ బర్ల్ (35)తో కలిసి బ్రైన్ బెన్నెట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బెన్నెట్ 56 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి స్కోరును 169కి చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోయినిస్, గ్రీన్ చెరో వికెట్ తీశారు.
36
ఆరంభంలోనే ఆస్ట్రేలియా వికెట్ల పతనం
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. బ్లెస్సింగ్ ముజరబానీ తన మొదటి ఓవర్‌లోనే ప్రమాదకరమైన జోష్ ఇంగ్లిస్‌ను (8) పెవిలియన్ పంపాడు. ఆ వెంటనే బ్రాడ్ ఎవాన్స్ తన అటాకింగ్‌తో కామెరాన్ గ్రీన్ (0)ను అవుట్ చేయగా, ముజరబానీ మళ్ళీ దాడి చేసి టిమ్ డేవిడ్‌ను సున్నాకే వెనక్కి పంపాడు. ట్రావిస్ హెడ్ (17) కూడా ఎవాన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో ఆస్ట్రేలియా 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కష్టాల్లో ఉన్న జట్టును మ్యాట్ రెన్షా (65), గ్లెన్ మాక్స్‌వెల్ (31) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆశలు చిగురింపజేశారు. అయితే, సికందర్ రజా కండరాల నొప్పితో మైదానం వీడిన సమయంలో బౌలింగ్‌కు వచ్చిన ర్యాన్ బర్ల్, మాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన రెన్షా 44 బంతుల్లో 65 పరుగులు చేసి ముజరబానీ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. స్టోయినిస్ (6) కూడా విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది.
56
జింబాబ్వే గెలుపు మంత్రం.. ఆస్ట్రేలియా ఓటమికి ఐదు కారణాలు
1. ముజరబానీ స్పెల్: ముజరబానీ వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీలు ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అతను తీసిన 4 వికెట్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి.
2. ఫీల్డింగ్ మెరుపులు: జింబాబ్వే ఫీల్డర్లు బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్‌లు పట్టి, కనీసం 15-20 పరుగులు సేవ్ చేశారు. టోనీ మున్యోంగా పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
4. నిలకడైన భాగస్వామ్యాలు: బెన్నెట్ ఒకవైపు యాంకర్ రోల్ పోషిస్తూనే, ఇతర బ్యాటర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించడం జింబాబ్వేకు కలిసొచ్చింది.
5. ఆస్ట్రేలియా ఒత్తిడి: పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా కోలుకోలేకపోయింది. రన్ రేట్ పెరగడం వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టింది. అలాగే, జింబాబ్వే బ్యాటింగ్ సమయంలో ఆసీస్ బౌలింగ్ ప్రభావం చూపలేదు.
66
గ్రూప్ బీ పాయింట్ల పట్టిక
ఈ విజయంతో జింబాబ్వే గ్రూప్-బీలో 4 పాయింట్లతో శ్రీలంకతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 2 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ముజరబానీ తన కెరీర్‌లో 100వ టీ20 వికెట్ మైలురాయిని కూడా ఈ మ్యాచ్‌తోనే చేరుకోవడం విశేషం. వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై టీ20ల్లో జింబాబ్వేకు ఇది రెండో విజయం. అంతకుముందు 2007 లో కూడా కంగారు టీమ్ ను జింబాబ్వే ఓడించింది.